బాబు, లోకేష్‌ను చూసి భూమాతా భయపడుతోంది

21 Oct, 2018 04:21 IST|Sakshi

     భూసంతర్పణలు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు

     రూ.వందకోట్ల విలువైన స్థలానికి ఏడాదికి అద్దె రూ.వెయ్యేనా?

     జీవో నంబర్‌ 340ని తక్షణమే రద్దు చేయాలి

     వైఎస్సార్‌సీపీ నేతలు వెలంపల్లి, మల్లాది విష్ణు డిమాండ్‌

విజయవాడ సిటీ: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను చూసి భూమాత కూడా భయపడుతోందని వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూసంతర్పణలు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎవడబ్బ సొమ్మని చంద్రబాబు, దేవినేని ఉమాలు నగరం నడిబొడ్డునున్న ఇరిగేషన్‌ స్థలాన్ని ధారాదత్తం చేస్తారని ధ్వజమెత్తారు. జీవో 340 ద్వారా ఇరిగేషన్‌ స్థలాన్ని టీడీపీ కృష్ణా జిల్లా కార్యాలయంగా దోచుకోవడాన్ని తప్పుబట్టారు. అమరావతిలో ఖాళీస్థలం కనబడితే చాలు దోచుకోవడానికి తండ్రీకొడుకులు రంగం సిద్ధం చేస్తున్నారని దుయ్యబట్టారు.  

కేబినెట్‌ సమావేశాల్లో ప్రజల సంక్షేమానికి సంబంధించి చర్చ జరగట్లేదని, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి?, ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు ధారాదత్తం చేయాలనే అంశాలపైనే చర్చ జరుగుతోందని చెప్పారు. అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి లోకేష్‌ చాలెంజ్‌ విసరడం హాస్యాస్పదమన్నారు. ప్రతి వ్యవహారంలో స్టేలు తెచ్చుకునే చంద్రబాబు, లోకేష్‌లకు విచారణ చేయించుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. సీఎం రమేష్, సుజనాచౌదరిలపై ఐటీ దాడులు జరిగితే రాష్ట్రానికేదో అన్యాయం జరిగిపోతుందన్నట్టుగా బాబు ప్రవర్తన ఉందని తప్పుపట్టారు. వారిద్దరూ చంద్రబాబు బినామీలనే సంగతి రాష్ట్రమంతా తెలుసన్నారు. 

ఆ హక్కు మీకెక్కడిది: మల్లాది విష్ణు
టీడీపీ అధికారంలోకొచ్చాక భూకేటాయింపులు విపరీతంగా పెరిగిపోయాయని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు తన సొంత ఆస్తుల్లా ప్రభుత్వ భూముల్ని కేటాయిస్తున్నారన్నారు. విజయవాడ నడిబొడ్డున రూ.100 కోట్ల విలువచేసే భూమిని ఏడాదికి రూ.1000 అద్దెకు కట్టబెడతారా! అని మండిపడ్డారు.  తక్షణమే జీవో 340ని రద్దు చేయాలన్నారు. భూకేటాయింపులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. టీడీపీ కార్యాలయాలకు, ఇతర సంస్థలకు ఇచ్చిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు