కుట్రతోనే ద్రవ్య బిల్లుకు మోకాలడ్డు

19 Jun, 2020 02:44 IST|Sakshi

ఉద్యోగుల జీతాలు రాకుండా ఉండేందుకు అడ్డుకున్నారు 

అంగబలం ఉందని విధ్వంసం చేయడం సిగ్గుచేటు 

లోకేశ్‌ చౌదరి ప్రోత్సాహంతోనే మంత్రులపై దాడులు 

మంత్రి వెలంపల్లి ఆగ్రహం

సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు కుట్రపూరితంగానే ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అగ్రహం వ్యక్తంచేశారు. స్వయం ప్రకటిత మేధావి, అసెంబ్లీ రూల్స్‌ బుక్‌ తానే తయారుచేసినట్లు ఫీలయ్యే యనమల రామకృష్ణుడు.. బిల్లులను మండలిలో అడ్డుకుని తీరుతామని ముందే చెప్పారన్నారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

► సంఖ్యాబలం ఉందని మండలిలో టీడీపీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది.
► నారా లోకేశ్‌ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్‌పై గూండాల్లా దాడి చేశారు.
► ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేశ్‌ దాడికి తెగబడ్డారు. 
► ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారు. 
► గతంలో చైర్మన్‌ విచక్షణాధికారం అని చెప్పి రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్‌ కూడా అదే రీతిలో ప్రవర్తించారు. 
► చైర్మన్‌ సీట్లో కూర్చొన్న వ్యక్తి టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మా వాళ్లు’ అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? 
► తనను ఓడించిన ప్రజల మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే యనమల నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు.  
► చైనా సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన తెలుగు వ్యక్తి కల్నల్‌ సంతోష్‌బాబుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైఎస్సార్‌సీపీ తరఫున నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 

లోకేశ్‌ డైరెక్షన్‌లోనే దాడి 
చంద్రబాబు, లోకేశ్‌ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నందుకే చంద్రబాబు తనయుడు లోకే‹శ్‌ నాయుడు తనపై కక్షగట్టి ప్రవర్తిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రార్థనలు అంటూ దుష్ప్రచారం చేసిన లోకేశ్‌కు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆనాడు సవాల్‌ విసిరానని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్‌ వేదికగా లోకేశ్‌ దాడులు చేయించారని వెలంపల్లి అన్నారు. ఆర్యవైశ్యుడినని.. మాటల్లో చెప్పలేని విధంగా తనపై దాడి చేశారని గురువారం ఆయన ‘సాక్షి’తో అన్నారు. ల్యాండ్‌ మాఫియా గూండా దీపక్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి మంత్రులను బయటకు నెట్టేయాలంటూ మాట్లాడారని తెలిపారు. రూల్స్‌కు విరుద్ధంగా లోకేశ్‌ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయడం.. వీడియో రికార్డింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే నాపై టీడీపీ నేతలు దాడిచేశారని.. ఇదంతా మీడియా వారు లాంజ్‌లో నుంచి చూశారని మంత్రి వివరించారు. లోకేశ్, దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర మీద డిప్యూటీ చైర్మన్‌ చర్యలు తీసుకోవాలని వెలంపల్లి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమన్వయంతో ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు కాబట్టే సమన్వయంతో ఉంటున్నామని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తలు