అక్కడ ఆమోదించి... ఇక్కడ డ్రామాలా?

7 Feb, 2018 10:14 IST|Sakshi
మాట్లాడుతున్న వెలంపల్లి శ్రీనివాస్, పక్కన మల్లాది విష్ణు

టీడీపీ నేతలపై వైఎస్సార్‌ సీపీ ధ్వజం

వామపక్షాల బంద్‌కు పూర్తి మద్దతు

విజయవాడసిటీ: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 8వ తేదీ వామపక్షాలు ఇచ్చిన బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ప్రకటించారు. బీసెంట్‌రోడ్డులోని మల్లాది విష్ణు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బంద్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజ, మహిళా విభాగాలతో పాటు అన్ని అనుబంధ సంఘాలు కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర కేబినెట్‌లో భాగస్వామిగా ఉన్న టీడీపీ.... పార్లమెంటు లోపల బడ్జెట్‌కు ఆమోదం తెలిపి, మరో వైపు బయటకొచ్చి డ్రామాలాడుతోందని  ధ్వజమెత్తారు. ఇవన్నీ చంద్రబాబు చేస్తున్న కొత్తడ్రామాలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్సీ సోమువీర్రాజు చేసిన ఆరోపణలు వాస్తవం కాదా అని  ప్రశ్నించారు.

నాలుగేళ్లుగా ఏమి సాధించలేక దుక్కుతోచని స్థితిలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక వీరుడు వైఎస్‌ జగన్‌ అనే విషయాన్ని గుర్తు చేశారు.  
కుంభకోణాలపై న్యాయ విచారణ చేయాలి...

రాజధాని అమరావతిలో రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్న భూ కుంభకోణాలపై న్యాయవిచారణ జరిపించాలని మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మందడంలో గౌస్‌ ఖాన్‌ అనే భూమిలేని వ్యక్తికి ల్యాండ్‌ పూలింగ్‌లో ప్లాట్లు కేటాయించడం, అతినికి మూడున్నర కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం కల్పించడం వెనుక సీఆర్‌డీఏ పాత్ర స్పష్టంగా ఉనట్లు తెలుస్తోందన్నారు.

మరిన్ని వార్తలు