'దిక్కుమాలిన రాజకీయాలు మానుకుంటే మంచిది'

19 May, 2020 14:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ కనక దుర్గమ్మ వారధి వద్ద వలస కార్మికులకు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలస కూలీలకు ఆహరం అందజేశారు. అనంతరం  మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ' వలస కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రామిక్ రైళ్లు, బస్సులు ద్వారా వారిని స్వస్థలాలకు చేరుస్తున్నాం. వలస కార్మికులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనుక్షణం ఆలోచిస్తున్నారు. వలస కూలీలపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి. ('వలస కూలీలు ఇకపై ఇబ్బంది పడకూడదు')

కన్నా లక్ష్మీ నారాయణ లెటర్లు రాసి బురద చల్లాలని చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలస కార్మికులు భరోసా ఇచ్చారా....? జూమ్ యాప్‌ ,టెలీ కాన్ఫరెన్స్‌ల పేరుతో హైదరాబాద్‌లో ఉండి హడావిడి చేస్తున్నారు. కార్మికుల, శ్రామికుల పార్టీలు అని చెప్పుకునే వామపక్షాలు సైతం కుటిల రాజకీయాలు చేస్తున్నాయి. బెంగాల్ వలస కార్మికులను రెచ్చగొడుతున్నారు. బెంగాల్ రాష్ట్ర సీఎం మమతను వలస కార్మికులను తమ రాష్ట్రంలోకి అనుమతించాలంటూ లేఖ పంపాము.. వారి నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.

ఒక గంట సేపు దీక్ష చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వలస కూలీలకు మంచినీళ్లు అయినా ఇచ్చారా?. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదు. రెండు నెలల బిల్లులు ఒకేసారి రావడంతో  ప్రజలు అధికంగా వచ్చాయన్న బావన లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేసే తోక పార్టీల నాయకులు కరెంటు బిల్లులపై ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎవరు ఉన్నారని వీడియో కాన్ఫరెన్స్ లు పెడతారు... రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు పవన్ కల్యాణ్.టీడీపీ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విపత్తు సమయంలో సైతం జగన్‌  రైతులకు అండగా నిలిచారు. రైతు భరోసా ఇచ్చి వారిలో దైర్యాన్ని నింపారు. రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. రూ.3 వేల కోట్లతో  రైతుల కోసం మూలనిధి ఏర్పాటు చేశారు. రైతు భరోసా రూపంలో ఒక్కో రైతుకు వారి ఖాతాల్లో రూ. 5500 జమచేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు దిక్కుమాలిన రాజకీయాలు మానుకోవాలి' అంటూ తెలిపారు.

మరిన్ని వార్తలు