విధులకు దూరంగా ఉండాలి

23 Apr, 2018 02:20 IST|Sakshi

సీజేఐపై అభిశంసన నోటీసు నేపథ్యంలో ఇది సంప్రదాయం

నోటీసును వెంకయ్య తిరస్కరిస్తే సుప్రీంకు వెళ్లే యోచన: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: ఏడు ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్‌ మిశ్రాపై అభిశంసన నోటీసులు ఇచ్చినందున ఆయన న్యాయవిధులకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ కోరింది. గతంలో అభిశంసనను ఎదుర్కొన్న న్యాయమూర్తులు వారిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయే వరకు విధులకు దూరంగా ఉన్నారనీ, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కూడా ఆ సంప్రదాయాన్ని పాటించాలని కాంగ్రెస్‌ పేర్కొంది. సీజేఐకి బీజేపీ మద్దతు తెలపడంపైనా కాంగ్రెస్‌ మండిపడింది. అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించింది. 

‘తన పదవిని రాజకీయాల కోసం వాడుకోవద్దని బీజేపీకి సీజేఐ చెప్పాలి’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాల అన్నారు. ‘సీజేఐ తనపై ఏ అనుమానాలూ రాకుండా చూసుకోవాలి. ప్రవర్తనపై అనుమానాలు వచ్చినప్పుడు విధుల నుంచి తప్పుకుని విచారణకు సహకరించి తన సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిశంసన కోసం ఇచ్చిన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు తిరస్కరిస్తే సుప్రీంను ఆశ్రయించాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎలాంటి గడువూ లేకపోయిన రాజ్యసభ చైర్మన్‌ నోటీసును అట్టిపెట్టుకోకూడదని న్యాయ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.

సంప్రదింపులు ప్రారంభించిన వెంకయ్య
అభిశంసన నోటీసులపై సంప్రదింపుల ప్రక్రియను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో ఆదివారం చర్చలు జరిపారు. హైదరాబాద్‌ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఆయన..  అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డిని కూడా సంప్రదిస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు