ఏకాభిప్రాయానికి రావాలి

2 Jul, 2018 04:30 IST|Sakshi

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికపై వెంకయ్య

కురియన్‌కు వీడ్కోలు పలికిన నేతలు  

న్యూఢిల్లీ: రాజ్యసభకు తదుపరి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికపై ఏకాభిప్రాయానికి రావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆదివారం కోరారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఆదివారం పదవీ విరమణ పొందిన పీజే కురియన్‌కు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య ఈ విజ్ఞప్తి చేశారు. వీడ్కోలు కార్యక్రమానికి పార్టీలకతీతంగా పలువురు నేతలు హాజరయ్యారు. వెంకయ్య మాట్లాడుతూ ‘తదుపరి డిప్యూటీ చైర్మన్‌గా ఎవరు ఉండాలనేదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని నేను ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

కురియన్‌ తనకు మంచి సహోద్యోగిగా ఉన్నారనీ, ఎంతో ఉత్సాహంతో సభను నడిపేవారని వెంకయ్య కొనియాడారు. అనంతరం కురియన్‌ మాట్లాడుతూ పెద్ద ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేలా చూడాలని సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే ఇరుపక్షాలు కలసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప అస్తమానం సభా కార్యకలాపాలకు అడ్డుతగలకూడదని హితవు చెప్పారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు రవి శంకర్‌ ప్రసాద్, పియూష్‌ గోయల్, విజయ్‌ గోయెల్, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు