ఒకే వారంలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తే మంచిది

10 Jan, 2020 03:36 IST|Sakshi
గురువారం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ‘రాజకీయాల్లో ధనబలం’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జయప్రకాష్‌ నారాయణ తదితరులు

‘రాజకీయాల్లో ధన బలం’ అంశంపై సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఒక వారం వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా చూస్తే మంచిదని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏడాదంతా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో వీటిపైనే పార్టీలు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకునే చర్యలతోపాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గురువారం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రాంగణంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఫౌండేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్, ఐఎస్‌బీల ఆధ్వర్యంలో ‘రాజకీయాల్లో ధనబలం’అంశంపై ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు.

నోటుతో.. ప్రశ్నించే గొంతు కోల్పోతాం
ఓటుకు నోటు తీసుకుంటే ప్రశ్నించే గొంతును కోల్పోతామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు బస్సు, బీరు, బిర్యానీ అనే త్రీ బీ సర్వసాధారణమై పోయాయని, వీటికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌పై విశ్వవ్యాప్తంగా గౌరవం ఉందని.. అయితే.. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా మన దేశాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఎన్నికల్లో, ధన, అంగబలంపై నియంత్రణ అవసరమన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు, పార్టీల విధానాలపై సమీక్ష అవసరమన్నారు.

ప్రజలు నిబద్ధత, సత్ప్రవర్తన, పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను చట్టసభలకు పంపడం వల్లే వారి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలన్నారు. కోటీశ్వరులే ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితులుంటే.. నిజంగా ప్రజాసేవ చేసే వారికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండదన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో పార్టీలు జవాబుదారీతనాన్ని అలవాటు చేసుకుని ప్రజల్లో విశ్వాసం చూరగొనాలని ఆయన సూచించారు.

అందరికీ సమాన అవకాశాలు ఉండటం లేదు: జేపీ 
ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోవడం వల్ల ధనికులే పోటీ చేయగలుగుతున్నారని, పోటీకి అందరికీ సమాన అవకాశాలు ఉండటం లేదని ఎఫ్‌డీఆర్‌ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్‌ నారాయణ అన్నారు. ఎన్నికల్లో ధన బలాన్ని, ధన ప్రవాహాన్ని తగ్గించకపోతే అవినీతి, అక్రమాలు మరింతగా పెచ్చుమీరే అవకాశాలున్నాయన్నారు. దేశంలో ఎన్నికల ద్వారా శాంతియుతమైన పద్ధతుల్లో అధికార మార్పిడి జరుగుతున్నా ప్రజాస్వామ్యం పూరిస్థాయిలో పనిచేయడం లేదన్నారు. మరింత మెరుగైన పద్ధతుల్లో ప్రజలకు సేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు