కులాల మధ్య మంత్రి చిచ్చు

23 May, 2018 09:12 IST|Sakshi
జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావుతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు

ఒక కులం వారి గడ్డివాములు తొలగించి.. మరొక కులం వారికి పట్టాలిస్తారా?

ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపాటు

పోలేపల్లి ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు  

అనంతపురం: మంత్రి పరిటాల సునీత గ్రామాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. రామగిరి మండలం పోలేపల్లి చోటు చేసుకున్న ఘటనపై వారు మంగళవారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అధికార పార్టీ నేతలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రామాలు ప్రశాంతంగా ఉండడం టీడీపీ వారికి ఇష్టం లేదన్నారు. ఎంతసేపూ చిచ్చుపెట్టి గ్రూపులు తయారు చేసి తాము లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

కులాల చిచ్చుతో శాంతిభద్రతలకు ముప్పు
పోలేపల్లిలో కనకదాస విగ్రహం ఏర్పాటు చేయాలని కురుబ కులస్తులు ఏడాదికిందటే సిద్ధం చేసుకున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అయితే విగ్రహం ఏర్పాటు చేయకుండా అధికార పార్టీ వారు అడ్డుపడ్డారని ఆరోపించారు. దీంతో గ్రామంలో కురుబ కులస్తులు వ్యతిరేకమవుతున్నారని భావించి వారి దృష్టి మళ్లించేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి గడ్డివాము కల్లాలు తొలగించి బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రకటించారన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే రెడ్డి – కురుబ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తేందుకు కారణమవుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. 

మాజీ మంత్రి రామచంద్రారెడ్డిని చూసి నేర్చుకోండి  
బీసీలకు న్యాయం చేయడంలో మాజీ మంత్రి ఎస్‌.రామచంద్రారెడ్డి తనకు తానే సాటి అని, ఆయన్ని చూసి నేర్చుకోవాలని మంత్రి పరిటాల సునీతకు తోపుదుర్తి సూచించారు.   

స్థలం కొని బీసీలకు పట్టాలివ్వండి
ఎస్‌. రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో ఏడు ఎకరాల భూమి కొనుగోలు చేసి పట్టాలిప్పించి ఇళ్లు కూడా నిర్మించారని వైఎస్సార్‌సీపీ నాయకులు చిట్ర రఘునాథ్, బోయ సూరి, గ్రామ రైతులు తెలిపారు. మరి 25 ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పరిటాల కుటుంబం ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు. గ్రామంలోని బీసీలు కోరుకుంటే రైతులంతా చందాలు వేసుకుని వారి ఇళ్లస్థలాల కోసం భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే గడ్డివాము కల్లాలను తొలగించకుండా ప్రభుత్వం ద్వారా çస్థలం కొనుగోలు చేసి బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కుంటిమద్ది కేశవనారాయణ, రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి పోలేపల్లి ఆదిరెడ్డి ఉన్నారు.

ఖాళీ కాగితాలతో మభ్యపెట్టొద్దు..
టీడీపీ ఐదేళ్ల పాలనలో రాప్తడు నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ హయాంలో 30 వేల ఇళ్లు నిర్మించారని, ఒక్క రామగిరి మండలంలోనే 5 వేల ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఇదే రామగిరి మండలంలో మంత్రి పరిటాల సునీత కనీసం 500 ఇళ్లు కూడా కట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాలంటూ ఖాళీ కాగితాలతో ప్రజలను మభ్యపెట్టొద్దని హితవు పలికారు. చిత్తశుద్ధి ఉంటే కనకదాన విగ్రహం ఏర్పాటు చేయించి, ప్రభుత్వంతో భూమి కొనుగోలు చేయించి బీసీలకు పట్టాలిప్పించి పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు