‘అలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు’

2 Jun, 2019 15:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లిలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు, మందాజగన్నాదం, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి జెండా ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తుందన్నారు. కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఒక్క మత కలహాల ఘటన జరగలేదని గుర్తు చేశారు. కిషన్‌ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మతసామరస్యాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్రమంత్రి అయిన కిషన్‌ రెడ్డి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. తెలంగాణ ప్రజలను బాధపెట్టే ఇలాంటి ప్రకటనలు చేయకూడదని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పధకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రత్యేక ప్రతినిధులు సందర్శించారు.

మరిన్ని వార్తలు