తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజకీయ ప్రకంపనలు 

8 Jul, 2019 02:17 IST|Sakshi

కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం

సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి/విజయవాడ/ఇంద్రకీలాద్రి: రానున్న రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరో చెప్పలేని స్థితిలో ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫ్రంట్‌ ఫ్రంట్‌ అంటూ తిరిగిన 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి టెంటే ఊడిపోయిందని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీలో మాజీ సీఎం కుమారుడు, తెలంగాణలో సీఎం కుమార్తె ఓటమి చెందారన్నారు.

ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభకు పురస్కారం కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి... వచ్చే ఐదేళ్లలో భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, దేశంలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా కిషన్‌రెడ్డితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ భేటీ అయ్యారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటపాటు ఈ భేటీ జరగడం గమనార్హం. మరోవైపు విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న కిషన్‌రెడ్డి... తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రరాష్ట్రాలుగా సమన్వయంతో ముందుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు.  

మరిన్ని వార్తలు