ముగిసిన దీదీ ధర్నా

6 Feb, 2019 04:41 IST|Sakshi
ధర్నా ముగిశాక అక్కడి నుంచి వెళ్లిపోతున్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

సుప్రీంకోర్టు ఆదేశాలతో మమతా బెనర్జీ నిర్ణయం

సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషనర్‌ రాజీవ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం

ఆయనను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలొద్దని సీబీఐకి ఉత్తర్వులు

రాజీవ్‌పై చర్యలకు బెంగాల్‌ సీఎస్‌ను ఆదేశించిన కేంద్ర హోం శాఖ

ఈ తీర్పు తమకు నైతిక విజయమని చెప్పుకున్న మమత, బీజేపీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య నెలకొన్న వివాదం మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో తాత్కాలికంగా సద్దుమణిగింది. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణకు సహకరించాలని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాజీవ్‌ ను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టకుండా సీబీఐని కోర్టు నిలువరించింది. తీర్పు తమకు అనుకూలంగా ఉన్నందున ఆదివారం రాత్రి నుంచి తాను చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం మమతా బెనర్జీ ప్రకటించారు.

అయితే ఈ తీర్పు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంప పెట్టు అనీ, సీబీఐకి లభించిన నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాజీవ్‌ కుమార్‌పై సీబీఐ చర్యలను అడ్డుకోవాలంటూ బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన కలకత్తా హైకోర్టు కూడా విచారణ ప్రారంభించి, కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కారణంగా గురువారం వరకు వాయిదా వేసింది. అయితే రాజీవ్‌ తన ఉద్యోగ నియమాలను ఉల్లంఘించి క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించడం మరో కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది.

మా నైతిక విజయమిది: మమత
అరెస్టు చేయడం సహా రాజీవ్‌ కుమార్‌పై బలవంతపు చర్యలేవీ తీసుకోకుండా సీబీఐని సుప్రీంకోర్టు నిలువరించడం తమకు లభించిన నైతిక విజయమని మమత పేర్కొన్నారు. తీర్పు తమకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతిపక్షాల సలహా మేరకు మూడ్రోజులుగా చేపట్టిన ధర్నాను విరమించినట్లు ఆమె ప్రకటించారు. ‘కోర్టు ఉత్తర్వులు సామాన్యుడికి, ప్రజా స్వామ్యానికి, రాజ్యాంగానికి లభించిన విజయం. మాది ప్రజా ఉద్యమం. మేం ఐక్యంగా పోరాడతాం. మేం చట్టాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాం.’ అని మమత చెప్పారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ తమను వ్యతిరేకించే వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయననీ, మోదీని గద్దె దింపేవరకు పోరాడుతానని మమత శపథం చేశారు.

ఇక తన పోరాటాన్ని ఢిల్లీలో కొనసాగిస్తానని చెప్పారు. సీబీఐ అంటే తనకు గౌరవం ఉందనీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నోబెల్‌ పతకం దొంగతనం కేసును కూడా ఆ సంస్థ ఇంతే ఉత్సాహంతో దర్యాప్తు చేయాలని మమత కోరారు. అయితే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశాలను మాత్రమే సీబీఐ పాటిస్తోందని మమత ఆరోపించారు. ‘దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే మోదీకి వ్యతిరేకంగా ఎవ్వరూ గొంతెత్తి మాట్లాడకూడదు. ఎవరైనా అలా చేస్తే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. అదే వ్యక్తులు బీజేపీలో చేరగానే ఇక వాళ్ల జోలికి ఎవరూ వెళ్లరు’ అని మమత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వంపై పోరుకు ప్రణాళికలు రచించేం దుకు ఈనెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో విపక్షాల సమావేశం ఉంటుందన్నారు.

మమతకు చెంపపెట్టు: బీజేపీ
సుప్రీం తీర్పు మమతకు చెంపపెట్టు లాంటిదనీ, సీబీఐకి ఇది నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘పోలీస్‌ కమిషనర్‌ సహా చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఉద్యోగ నిమయాలను ఉల్లంఘించినందుకు రాజీవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కొందరు పోలీసు అధికారులతో కలిసి మమత ధర్నాలో రాజీవ్‌ కూడా పాల్గొన్నట్లు తమకు సమాచారం వచ్చిందనీ, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి మలయ్‌ కుమార్‌ను కోరింది.
చల్లగా ఉంటుంది..

షిల్లాంగ్‌లో విచారించండి
అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండేందుకు రాజీవ్‌ కుమార్‌ను తటస్థ ప్రదేశమైన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించాలని సుప్రీం కోర్టు సీబీఐకి సూచించింది. సీబీఐ పిలిచిన తేదీల్లో షిల్లాంగ్‌కు వెళ్లి విచారణకు హాజరు కావాల ని రాజీవ్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తోపాటు జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిల్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన బెంచ్‌ ఈ తీర్పు చెప్పింది. ‘షిల్లాంగ్‌కు వెళ్లండి. అక్కడ చల్లగా ఉంటుంది. ఇరుపక్షాలూ ప్రశాంతంగా ఉంటారు’ అని న్యాయమూర్తులు సరదాగా అన్నారు.

రాజీవ్‌ కుమార్‌ విచారణకు గైర్హాజరవడానికి కారణమేమీ లేదనీ, కాబట్టి ఆయనపై బలవంతపు చర్యలేవీ వద్దని కోర్టు పేర్కొంది. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించిన కీలక ఆధారాలు, సాక్ష్యాలను రాజీవ్‌ నాశనం చేశారనీ ఆరోపిస్తూ, ఆయనను విచారించేందుకు అనుమతించాల్సిందిగా సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం తెలిసిందే. ఈ కేసులను ఓ ప్రత్యేక బృందం (సిట్‌) అప్పట్లో రాజీవే పర్యవేక్షణలోనే దర్యాప్తు చేసింది. రాజీవ్‌ సాక్ష్యాలను నాశనం చేయడానికి ఏ కొంచెమైనా ప్రయత్నించినట్లు తేలితే ఆయన పశ్చాత్తాప పడేలా తమ చర్యలుంటాయని సుప్రీంకోర్టు సోమవారమే హెచ్చరించింది.

కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ రాజీవ్‌తోపాటు బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి, డీజీపీల పేర్లను కూడా సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో వీరంతా ఫిబ్రవరి 18లోపు తమ స్పందన తెలియజేయాలనీ, ఆ తర్వాత అవసరమైతే ఫిబ్రవరి 20న వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సి ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలు, బెంగాల్‌ పోలీస్‌ తరఫున ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు.

చిట్‌ఫండ్‌ కుంభకోణాలకు సంబంధించి సీబీఐకి బెంగాల్‌ పోలీసులు ఇచ్చిన సాక్ష్యాలు, ఆధారాలు అసలైనవి కాదనీ, కాల్‌డేటాలో కొంత సమాచారాన్ని తొలగించడం వంటి అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అధికార తృణమూల్‌కు సన్నిహితులు, లేదా సంబంధీకులు చిట్‌ఫండ్‌ కుంభకోణాల కేసుల్లో అరెస్టయ్యారని వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. విచారణకు హాజరు కావాలని రాజీవ్‌కు మూడుసార్లు సీబీఐ నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని ఏజీ తెలిపారు.

మరిన్ని వార్తలు