కరీంనగర్‌లో కోరెం అల్లుళ్లు

30 Mar, 2019 11:34 IST|Sakshi

కరీంనగర్‌ ఎంపీలుగా కోరెం గ్రామ అల్లుళ్లు

గతంలో విద్యాసాగర్‌రావు రెండుసార్లు ప్రాతినిధ్యం

ఇదే స్థానం నుంచి రెండోసారి వినోద్‌కుమార్‌ పోటీ

కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ మరోసారి బరిలో దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ అల్లుడీయన. కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి హన్మంతరావు, చెన్నాడి సత్యనారాయణరావు స్వయాన సోదరులు. సత్యనారాయణరావు–లచ్చమ్మల కుమార్తె వినోదను విద్యాసాగర్‌రావు వివాహం చేసుకున్నారు. చెన్నాడి హన్మంతరావు–శాంతమ్మల కుమారుడైన చెన్నాడి మార్తాండరావు కుమార్తె డాక్టర్‌ మాధవిని వినోద్‌కుమార్‌ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఈ ఇద్దరు అల్లుళ్లు.. కరీంనగర్‌ ఎంపీలుగా ఎన్నిక కావడం యాదృచ్ఛికం. చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1998–99, 1999– 2004.. ఈ రెండు పర్యాయాలు బీజేపీ నుంచి కరీంనగర్‌ ఎంపీగా విజయం సాధించారు. ఇపుడు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన వినోద్‌కుమార్‌ ఇపుడు మరోసారి బరిలో ఉంటున్నారు. వినోద్‌కుమార్‌కు విద్యాసాగర్‌రావు వరుసకు బాబాయ్‌ అవుతారు.– పట్నం ప్రసాద్, బోయినపల్లి్ల

స్మార్ట్‌ ఎంపీ :కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కరీంనగర్, చొప్పదండి (ఎస్సీ), సిరిసిల్ల, మానకొండూర్‌ (ఎస్సీ), హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీచేసిన బోయినపల్లి వినోద్‌ కుమార్‌ 2,04,652 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై విజయం సాధించి, కరీంనగర్‌ 16వ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి లోక్‌సభ పక్ష ఉప నేతగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అనర్గళంగా మాట్లాడారు. ప్రత్యేక హైకోర్టు సాధన, కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైన్, కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించడంలో ఈయన పాత్ర      ఎనలేనిది. అలాగే, ఈ నెల 17న కరీంనగర్‌లో నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావంలో వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఎంపీగా గెలిచాక, కేంద్రంలో ఏర్పడబోయే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో వినోద్‌కు కేంద్ర మంత్రి పదవి బోనస్‌గా వస్తుందని జోస్యం చెప్పారు. కాగా, ఈ ప్రాంతవాసులు ఎంపీ అల్లుళ్లు తమ ప్రాంతానికి చేసిన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

చెన్నమనేని విద్యాసాగర్‌రావు హయాంలో జిల్లాతో పాటు బోయినపల్లి మండలఅభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని నర్సింగాపూర్‌కు చెందిన జోగినిపల్లి ఆదిత్య గుర్తు చేసుకున్నారు. విద్యాసాగర్‌రావు, వినోద్‌కుమార్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు, బోయినపల్లిమండలానికి, కోరెం గ్రామానికి విశేషమైన సేవలందించారని డాక్టర్‌ చెన్నాడి అమిత్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు