రాజీనామా చేసిన 24 గంటల్లోపు మంత్రి పదవి!

9 Mar, 2019 16:50 IST|Sakshi
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జవహర్‌ చవ్దా

ఇద్దరు కాంగ్రెస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అవకాశం

గుజరాత్‌ కేబినెట్‌ విస్తరణ

అహ్మదాబాద్‌: విజయ్‌ రుపానీ ప్రభుత్వం శుక్రవారం గుజరాత్‌ కేబినెట్‌ను మరోసారి విస్తరిస్తూ.. ముగ్గురు మంత్రులను కొత్తగా తీసుకుంది. ​కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్‌ నేత ఒకరికి ఈసారి అవకాశం కల్పించింది. 

మనవాదర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జవహర్‌ చవ్దా పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లోపు ఆయనను రూపానీ ప్రభుత్వం కేబినెట్‌లోకి తీసుకోవడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 2017లో బీజేపీలోకి ఫిరాయించిన మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ధావల్‌ సిన్హా జడేజాకు కూడా రూపానీ సర్కారు అవకాశం కల్పించింది. మంజల్‌పూర్‌ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్‌ నేత యోగేశ్‌ పటేల్‌కు కూడా మంత్రి అవకాశం కల్పించారు. 

తొమ్మిదినెలల్లో రూపానీ ప్రభుత్వం చేపట్టిన రెండో కేబినెట్‌ విస్తరణ ఇది. 2018 జూలైలో సీనియర్‌ నాయకుడు కున్వర్జీ బవలియాను కేబినెట్‌లోకి తీసుకుంది. ఆయన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి రూపానీతో కలుపుకొని గుజరాత్‌ కేబినెట్‌ మంత్రుల సంఖ్య 24కు చేరుకుంది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన అల్ఫేష్‌ ఠాకూర్‌ కూడా బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలకు ఆయన తాజాగా తెరదించారు. మంత్రిని కావాలని భావించిన మాట నిజమే కానీ, ఆ పదవితో తన సామాజికవర్గం సమస్యలను పరిష్కరించలేనని గుర్తించడంతో ఆ ఆలోచన మానుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు