రూపానీదే గుజరాత్‌ పీఠం

23 Dec, 2017 01:22 IST|Sakshi
గాంధీనగర్‌లో స్వీట్లు తినిపించుకుంటున్న రూపానీ, నితిన్‌ పటేల్‌

ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ శాసనసభా పక్షం

బీజేఎల్పీ నేతగా విజయ్‌ రూపానీ, ఉప నేతగా నితిన్‌ ఎంపిక

హిమాచల్‌ సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ

గాంధీనగర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అత్యంత విధేయుడైన విజయ్‌ రూపానీనే రెండోసారీ గుజరాత్‌ సీఎం పీఠం వరించింది. శుక్రవారం గుజరాత్‌ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యులతో భేటీ తర్వాత పార్టీ కేంద్ర పరిశీలకుడు అరుణ్‌ జైట్లీ వివరాలు వెల్లడిస్తూ.. శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్‌ పటేల్‌ను ఎన్నుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్‌ ఎన్నిక ల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవ సం చేసుకున్నా తక్కువ మెజార్టీతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో రూపానీని మరోసారి సీ ఎంగా కొనసాగించే అంశంపై ఊహాగానాలు కొనసాగాయి.

అయితే పార్టీ అగ్ర నాయకత్వంతో రూపానీకి ఉన్న సాన్నిహిత్యం.. ఎలాంటి మచ్చలేని రాజకీయ జీవితం, తటస్థ కుల వైఖరి వంటి అంశాలు పూర్తిగా ఆయన వైపు మొగ్గు చూపేలా చేశాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఉప నేత పదవులకు రూపానీ, పటేల్‌ పేర్లను ఎమ్మెల్యే భూసేంద్ర సిన్హ్‌ చుదాసమ సూచించారని.. మరో ఐదుగురు సభ్యులు చుదాసమ ప్రతిపాదనను సమర్ధించారన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రూపానీ సంప్రదింపులు జరుపుతారని జైట్లీ చెప్పారు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో.. 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది.  ఇక మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్‌ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ 80 స్థానాల్లో విజయం సాధించింది.  గుజరాత్‌లో స్వతంత్ర అభ్యర్థి రతన్‌ సిన్హ్‌ రాథోడ్‌ బీజేపీకి మద్దతు ప్రకటించారు.   

హిమాచల్‌ బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకుల భేటీ
మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ కేంద్ర పరిశీలకులైన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్‌ తోమర్‌ పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ ఇన్‌చార్జ్‌ మంగళ్‌ పాండేలు శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత మీడియాను కలవకుండానే ఢిల్లీ బయల్దేరారు. శాసనసభా పక్ష భేటీలో ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఈ బృందం పార్టీ అధినాయకత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా సీఎం పేరుపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. కంగ్రా ఎంపీ శాంతా కుమర్, మండీ ఎంపీ రామ్‌ స్వరూప్, సిమ్లా ఎంపీ కశ్యప్, మరో సీనియర్‌ నేత సురేశ్‌ భరద్వాజ్‌లు... పార్టీ కేంద్ర పరిశీలకుల్ని కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం రేసులో కేంద్ర మంత్రి నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్‌లు ముందు వరుసలో ఉన్నారు.

మయన్మార్‌ టు భారత్‌
విజయ్‌ రూపానీ(61) మయన్మార్‌ రాజధాని యాంగాన్‌(అప్పట్లో రంగూన్‌)లో జన్మించారు. ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కారణంగా 1960లో రూపానీ కుటుంబం గుజరాత్‌కు తరలివచ్చి రాజ్‌కోట్‌లో స్థిరపడింది. విద్యార్థి దశలోనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. కొన్నాళ్లు ఏబీవీపీలో పనిచేశాక బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. జైన వర్గానికి చెందిన రూపానీ గుజరాత్‌లో బీజేపీ పటిష్టానికి ఎంతో కృషి చేశారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014లో గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ వజూభాయ్‌ వాలా కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడంతో.. రాజ్‌కోట్‌ వెస్ట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఫిబ్రవరి 19, 2016లో గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆగస్టు, 2016లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ రాజీనామాతో ఆయనను సీఎం పీఠం వరించింది. 2006లో గుజరాత్‌ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రోత్సాహానికి చేసిన కృషి ప్రశంసలు అందుకుంది.

మరిన్ని వార్తలు