శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై మండి పడ్డ విజయ్‌ రూపానీ

25 Mar, 2019 08:35 IST|Sakshi

గాంధీనగర్‌ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గనుక గెలిస్తే.. పాక్‌ దీపావళి పండుగ జరుపుకుంటుందని బీజేపీ సీనియర్‌ నేత, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆరోపించారు. బాలాకోట్‌లో జరిగిన మెరుపు దాడులకు సంబం‍ధించి ఆధారాలు చూపాలంటూ శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం బీజేపీ పార్టీ అధ్వర్యంలో జరిగిన ‘విజయ్‌ సంకల్ప్‌’ ర్యాలీ ప్రారంభోత్సవానికి హాజరైన విజయ్‌ రూపానీ  మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు పుట్టినిల్లు అనే విషయం ప్రపంచానికంతటికి తెలుసు. కానీ రాహుల్‌ గాంధీ టీచర్‌ శామ్‌ పిట్రోడా మాత్రం ఎవరో పది మంది ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్తాన్‌ను నిందించడం సరికాదంటూ ఆ దేశం తరఫున వకల్తా పుచ్చుకుంటారు. పైగా సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఆధారాలను చూపించమంటూ డిమాండ్‌ చేస్తారు. దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ బలగాలను పదే పదే అవమానించడం విపక్షాలకు అలవాటుగా మారిందం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాక ‘ఒక వేళ మే 23న గనుక కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. పాక్‌ దీపావళి చేసుకుంటుంది. ఎందుకంటేం పాక్‌, కాంగ్రెస్‌ ఎల్లప్పుడు కలిసే ఉంటాయి’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. మోదీ భాయ్‌ భారత్‌ను రామ రాజ్యంగా మార్చలనుకుంటున్నారన్నారు. కానీ కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌లు, టెర్రరిస్ట్‌లు, న​క్సలైట్లు, అవినీతిపరులు, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్‌, చంద్రబాబు లాంటి స్వార్థ ప్రతిపక్ష నేతలు మోదీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే జనాలు వారి ఆటలు సాగనివ్వరని తెలిపారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలంటే మోదీనే మరోసారి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

>
మరిన్ని వార్తలు