మహానేత అడుగు జాడల్లోనే  వైఎస్‌ జగన్‌ పాలన

9 Jul, 2019 04:42 IST|Sakshi
ఢిల్లీ ఏపీ భవన్‌లో నిర్వహించిన వైఎస్సార్‌ జయంతి  వేడుకల్లో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి.  చిత్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ జయంతి  వేడుకల్లో ఎంపీలు

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నివాళి

వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించిన తెలంగాణ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌/అమరావతి: ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. తొలుత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మాటాడుతూ.. రైతే దేశానికి వెన్నెముక అని బలంగా నమ్మి రైతు సంక్షేమానికి, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి వైఎస్సార్‌ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రతి గింజ మీద దాన్ని తినే వారి పేరు రాసి ఉంటుందని చెప్పినట్టుగానే.. రాష్ట్రంలో రైతు పండించే ప్రతి గింజ మీద ఆ రైతు పేరుతోపాటు వైఎస్సార్‌ పేరు కూడా ఉంటుందన్నారు.

ఆ స్థాయిలో రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ రక్తం పంచుకుని పుట్టిన ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తండ్రి అడుగు జాడల్లోనే పనిచేస్తారని, వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే నంబర్‌–1గా నిలుపుతారని అన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. రైతులతో మహానేతకు విడదీయలేని బంధం ఉందన్నారు. రైతుల గుండెల్లో ఆయన చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ తామంతా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి, మాంగుట శ్రీనివాసులురెడ్డి, రఘురామకృష్ణంరాజు, రెడ్డెప్ప, నందిగం సురేష్, గొడ్డేటి మాధవి, దుర్గాప్రసాద్, తలారి రంగయ్య పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. వైఎస్సార్‌ విగ్రహానికి మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి, మాజీ మేయర్‌ రత్నబిందు, పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌.పద్మజ, మాజీ కార్పొరేటర్లు జె.దామోదరరావు, చోడిశెట్టి సుజాత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అడపా శేషు, జానారెడ్డి, మైలవరపు దుర్గారావు, అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అరుణ్, యువజన విభాగం రాష్ట్ర నేత రామిరెడ్డి పాల్గొన్నారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో..
పదిమందికీ పట్టెడన్నం పెట్టే రైతులు చల్లగా జీవించాలని కలలుగన్న మనసున్న మహారాజు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజశేఖరరెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజకీయాలను హుందాగా నడిపిన గొప్ప నేత రాజన్న అని, భ్రష్టుపట్టిన నేటి రాజకీయాలను సమూలంగా మార్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డిని మనకు అప్పగించి వెళ్లిపోయారన్నారు.

తెలంగాణ నేతల నివాళి
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ నేతలు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. అంధులకు చెస్‌ కిట్లను పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకూ, గుండెకూ చేరినందున వైఎస్సార్‌ పేరు చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, జె.మహేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షులు కె.అమృతాసాగర్, సేవాదళ్‌ విభాగం నేత బండారు వెంకటరమణ, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఎన్‌.రవికుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు