‘వక్రీకరించినా.. నరకాసురుడు ఎప్పటికి విలనే’

25 Feb, 2019 11:00 IST|Sakshi

మహానాయకుడిపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి బాలకృష్ణ స్వయంగా నటించి, నిర్మించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘మహానాయకడు’  చిత్రం బాక్సాఫిస్‌ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికి విలనే, హీరో కాలేడు.’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరో సెటైరిక్‌ ట్వీట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను ఏకీపారేశారు. గెలుస్తామనే ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు దేనికీ భయపడరని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విజయాన్ని అడ్డుకోలేరని ధైర్యంగా చెప్పుతారని, పతనం తప్పదని గ్రహించిన వాళ్లే ఇతరులపై ఏడుస్తారన్నారు. ‘అదిగో వాళ్లెవరెవరో కలిసి పోయారు. చూశారా ఆయన్నుఈయన తిట్టడం లేదు. కుట్ర పన్నుతున్నారంటూ క్షణక్షణం వణికిపోతుంటారు’ అని పేర్కొన్నారు. ఇక కమీషన్ల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మెస్తున్నాడని మండిపడ్డారు. కేజీ బేసిన్‌ గ్యాస్‌ను ఏపీ గ్యాస్‌ కార్పోరేషన్‌ను కాదని, రిలయన్స్‌కు అప్పగించి లక్షల కోట్ల నష్టం కల్గించాడని, కాకినాడలో రిఫైనరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రభుత్వ రంగ హెచ్‌పీసీఎల్‌ను కాదని హల్దియా పెట్రో అనే కంపెనీకి 15వేల కోట్ల రాయితీలిస్తున్నాడని తెలిపారు.

ఏదీ.. అరెస్ట్‌ చేయండి?
‘ట్వీట్లు,ఫేస్ బుక్ సాకుగా చూపిస్తూ అరెస్ట్లు చేయొద్దంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా తెలియని మీరేం ఐటీ మంత్రి లోకేషూ!’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ‘ఆ రూలు వర్తింపచేస్తే మీ ట్వీట్లకు రోజుకు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ముందు మీ డాడీ షాడో నుంచి బైటకు రా.. చింతమనేని దళితులను దూషించే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి’ అని సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు