నిమ్మగడ్డ రమేష్‌ కరోనా కంటే ప్రమాదకరం

15 Mar, 2020 19:00 IST|Sakshi

ఎన్నికల కమిషనర్‌ తీరు సరైనది కాదు

ఆయన నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయిస్తాం

మీడియా సమావేశంలో విజయ్‌సాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. ప్రతిపక్ష టీడీపీకి మేలుచేకూర్చేందుకే ఎన్నికలను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌పై తమకు గౌరవం ఉందని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదో లేదో ప్రజలే తేలుస్తారని అన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికి రాజ్యాంగ విలువలను కాలరాశారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కంటే నిమ్మగడ్డ రమేష్‌ ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిపారు. (కరోనాకు ఎన్నికల వాయిదాకు సంబంధమేమిటి?)

ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ‘ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని, సంబంధిత సెక్రటరీలను సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం దారుణం. ఏ అధికారి అయినా వ్యవస్థ అభివృద్ధి కోసం పాటుపడాలి. రాజ్యాంగాన్ని, పోలీసులను, అధికారులను ఎవరినీ సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకున్నారు. నైతికత ఉంటే రమేష్‌ కుమార్‌ వెంటనే పదవికి రాజీనామా చేయాలి. నిమ్మగడ్డ రమేష్‌ అని పిలవడం కన్నా.. నారావారి గబ్బిలం అని పిలిస్తే బెటర్. ఆర్టికల్‌ 243కే ప్రకారం విపత్తుల సమయంలో మాత్రమే ఎన్నికలు వాయిదా వేయాలి’ అని అన్నారు.



చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారు..
కాగా ఇదే విషయంపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైఎస్సార్ సీపీ హవా కనిపిస్తోంది. అధికారం ఉన్నా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కమిషన్ వ్యవస్థను నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ భ్రష్టు పట్టించారు. చంద్రబాబు హయాంలోనే రమేష్‌ నియమితులైయ్యారు. అందుకే ఆయన రుణం తీర్చుకునేలా వ్యవహరిస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో కరోనా వుంటే ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించారా ? మీరు చెప్పినట్టు అరు వారాల తర్వాత కరోనా అదుపులోకి వస్తుందని అంచనాలు వేశారు.. మీ దగ్గర శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?. ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇవద్దని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదు’ అని అన్నారు.



విజయాన్ని మాత్రం ఆపలేరు..
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీదే విజయమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ‘కేంద్రం నుంచి రావాల్సిన 5 వేల కోట్లు రాకుండా చంద్రబాబు కుట్ర పన్నారు, ఎన్నికల వాయిదా అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎవరు ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు పంపిణీ వద్దని మరుసటి రోజు కరోనా కారణం చూపించారు. ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయగలిగారు..కానీ విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదే. చంద్రబాబు కుట్రలను మేధావులు ఖండించాలి’ అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు