ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

11 Dec, 2018 03:47 IST|Sakshi
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి

స్టీల్‌ ప్లాంట్, రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టులపై నిర్ణయం తీసుకోండి 

పాక్‌ చెరలో ఉన్న మత్స్యకారులను విడిపించండి

అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరిన వైఎస్సార్‌ సీపీపీ నేత విజయసాయిరెడ్డి

జగన్‌పై హత్యాయత్నం ఘటనను కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని, ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ కోరింది. మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 11 ప్రధానమైన అంశాలను సమావేశంలో లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్‌ 13లో ఉన్న విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ–చెన్నై కారిడార్, కడప స్టీల్‌ప్లాంట్, కరువు జిల్లాలకు ప్రత్యేక సాయం అమలుపై కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని కోరారు. ఇక ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ చేయడంలేదని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతం విమానాశ్రయం కావడంతో ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేందుకు ప్రత్యేక చట్టం ఉందని ఆయన వివరించారు. ఈ విషయంపై సమావేశంలోని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సానుకూలంగా స్పందించినట్టు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. 

దర్యాప్తు సంస్థలను నిషేధిస్తే ఎందుకు ప్రేక్షకపాత్ర!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలోకి అనుమతించకుండా నిషేధిస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ప్రేక్షకపాత్ర వహిస్తోందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ చర్యలతో ఏపీలో రాజ్యాంగం సంక్షోభంలో పడిందన్నారు. దేశంలోని ఏదైనా రాష్ట్రం స్వయంప్రతిపత్తి ప్రకటించుకుంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. అందువల్ల ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో సీఎం చంద్రబాబుపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్‌ కాల్‌ మాట్లాడింది చంద్రబాబే అని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చినపుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇక భూసేకరణ చట్టంలో ఏపీ ప్రభుత్వం చేసిన సవరణలతో పంటలు పండే భూములు తీసుకొనేందుకు, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేయాల్సిన అవసరం లేకుండా వెలుసుబాటు కల్పించుకున్నారని,వీటిపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.   

జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకోండి..
గుజరాత్‌–పాక్‌ సరిహద్దుల్లో చేపల వేటకు వెళ్లి అక్కడ పాక్‌ జలాల్లో ఆ దేశ ఆర్మీకి చిక్కిన ఏపీకి చెందిన 22 మంది మత్స్యకారులను విడుదల చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, హోం శాఖలు వెంటనే పాక్‌ అధికారులను సంప్రదించాలని కోరారు. తిత్లీ బాధితులకు పునరావాసం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఒక దేశం, ఒక ఓటు ఉండాలని, తెలంగాణ ఎన్నికల్లో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఓటు హక్కును రిట్‌ జ్యూరిడిక్షన్‌లోకి తీసుకురావాలని కోరారు. చంద్రబాబులా రంగులు మార్చే తత్వం తమది కాదని విజయసాయిరెడ్డి చెప్పారు. సోమవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. 

మరిన్ని వార్తలు