నువ్వు మారవు బాబూ..

29 May, 2019 16:25 IST|Sakshi
చంద్రబాబు నాయుడు

వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి టీడీపీ అధినేత చంద్రబాబును హుందాగా ఆహ్వానిస్తే దానికి ఇతర కథనం జోడించి సొంత మీడియాలో రాయించుకున్నారని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనుభవజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే ప్రజలు యువనేతకు పట్టం కట్టారు. నువ్వు మారవు బాబూ.’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

ఇప్పుడైన పరివర్తన వస్తుందనుకుంటే..
‘దేనిలో అనుభవజ్ణుడివి చంద్రబాబూ? కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, నయవంచన, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో తప్ప మీకు ఎందులో అనుభవం ఉంది బాబూ. చిత్తుగా ఓడిన తర్వాత కూడా అబద్ధాలతో ఆత్మవంచన చేసుకుంటున్నావు. మీ సలహా  విన్న వారంతా ఏమయ్యారో తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతారా బాబూ? మీ పిచ్చిగాని. 23 సీట్లకు పతనమైన తర్వాత అయినా పరివర్తన వస్తుందనుకుంటే ఇంకా మీకు రాలేదేంటి బాబూ. అనుకూల మీడియా ఉందని మీ కలలు, ఊహలన్నిటిని రాయించుకుని తృప్తి పడుతున్నారా? జూన్ 8 వరకు పదవీ కాలం ఉందని ఇంకా నమ్ముతున్నారా ఏంటి ఖర్మకాలి.’ అని విమర్శించారు.

నేను పక్కనే ఉన్నా..
‘ప్రజల ఆగ్రహం వల్ల ఓడిపోలేదట. సానుభూతి వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తేల్చాడు రాజకీయ మ్యానిపులేటర్ చంద్రబాబు. కిందపడ్డా నేనే గెలిచా అన్నట్టుంది ఆయన వాలకం. గెలిచిన పార్టీకి 50 శాతం ఓట్లు పడిన చరిత్ర ఉందా. దీన్ని సింపతీ అంటారా? మానసిక స్థితి ఇంకా దిగజారినట్టుంది. జగన్ గారు అత్యున్నత సంప్రదాయాన్ని పాటించి స్థానిక/జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలను ఫోన్ ద్వారా ఆహ్వానించే సమయంలో నేను పక్కనే ఉన్నా. మీకూ నాముందే ఫోన్ చేశారు. కానీ ఆయన మీ అనుభవం, సలహాలు అవసరం అనే మాటలే వాడలేదు. ఆయన అనని మాటల్ని అన్నట్టు ప్రచారం చేసుకునేంత నీచానికి దిగారు.’ అంటు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

ఇక గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆయన ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లకు సైతం వైఎస్‌ జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు.

మరిన్ని వార్తలు