వాళ్ల ఎదుట ప్రెస్‌మీట్‌ పెట్టండి సుజనా: విజయసాయిరెడ్డి

22 Nov, 2019 11:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎంపీ సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు... అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్థమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ’అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురుంచి ప్రెస్‌మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు. ‘ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అర డజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే... ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఆయనను ఎందుకు పార్టీ మార్చాడో అన్నీ అర్ధమవుతాయి’ అని చురకలు అంటించారు.

ఇక ఎల్లో మీడియా తీరును ప్రస్తావిస్తూ... ‘"సుజనా వారి మాయా సామ్రాజ్యం" మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు... సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు నిన్న ప్రెస్ మీట్‌ను లైవ్‌లో, లైవ్ స్ట్రీమింగ్‌లో మోతెక్కించిందంటే... కారణం పబ్లిక్ ఇంట్రెస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?’ అని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలో స్వప్రయోజనాల కోసమే ఆయన బీజేపీలో చేరారంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు