చంద్రబాబుకు ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?

6 Jun, 2019 11:10 IST|Sakshi

సాక్షి, అమరావతి :  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా?, పోతుందా అనే సంశయం తప్ప...ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?’ అంటూ ట్వీట్‌ చేశారు. (రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ చంద్రబాబు రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు.)

చదవండి: (అక్రమ కట్టడాల కోసం లేఖలా?)

అలాగే టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్‌ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు సాహసోపేత నిర్ణయమని విజయసాయి రెడ్డి అభివర్ణించారు. కొన్ని సందర్భాల్లో విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ చేయించడం చూశామని, ఇప్పుడు నిరంతరం స్క్రూటినీ ఉంటుందన్నారు. వైఎస్‌ జగన్‌ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుందో ఇది చిన్న ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇ‍క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శారదా పీఠాన్ని సందర్శించడంపై పచ్చ చానల్ ఒకటి చర్చపెట్టిందని, కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని తన అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారు. పీఠాదిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తా అంటూ సూటిగా ప్రశ్నించారు.

కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను గురువారం ఉదయం ఎంపీలు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభలో వైఎస్సార్‌ సీపీ పక్ష నేతగా మిథున్‌ రెడ్డిని నియమించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు