చంద్రబాబు.. యుద్ద శంఖారావం వినపడక ముందే

4 Mar, 2019 10:41 IST|Sakshi

సగం మంది ఎంపీలు చేతులెత్తేశారు

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల శంఖారావం వినపడక ముందే సగం మంది టీడీపీ ఎంపీలు రణక్షేత్రం నుంచి పారిపోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ బాబును ఏకిపారేశారు. ‘సగం మంది టీడీపీ ఎంపీలు మళ్లీ పోటీ చేయలేమని చేతులెత్తేశారు. ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే. యుద్ద శంఖారావం వినపడక ముందే రణ క్షేత్రం నుంచి పారిపోతున్నారు. అర్థమైందా చంద్రబాబూ. మీ పరాజయం ఏ స్థాయిలో ఉంటుందో. లక్షల కోట్లు వెదజల్లినా మీకు డిపాజిట్లు దక్కవు.’ అని ట్వీట్‌ చేశారు.

ఇంకే రాష్ట్రంలో కనిపించదు..
ఎలక్షన్ల తర్వాత తండ్రికొడుకులు చిప్పకూడు తింటారనుకున్నారని, కానీ ముందే  లోపలికి పోయేట్టున్నారని ఎద్దేవా చేశారు. వారి పాపాలు ఇంత తొందరగా పండుతాయనుకోలేదని, యావజ్జీవ శిక్షలకు సరిపడా తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. గెలుపు మీద నమ్మకం లేకే సీఎంగా ఉన్న వ్యక్తే ఓటర్ల జాబితాను తారుమారు చేయడం.. దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ కనిపించదన్నారు. ఆధార్ డేటాను, ఎలక్షన్ కమిషన్ ఓటర్ డేటాను హ్యాక్ చేసి తండ్రికొడుకులు నైజీరియన్ మోసగాళ్లను మించి పోయారని మండిపడ్డారు. వేల కోట్లు వెదజల్లినా ప్రయోజనం లేదని భావించి నీచపు పనులకు దిగారని పేర్కొన్నారు. దొంగే, దొంగ... దొంగ అని అరిచాడనే సామెత చంద్రబాబు కోసమే పుట్టినట్టుందని, మోసంతోనైనా గెలవాలని 59 లక్షల బోగస్ ఓట్లు చేర్పించారని, లక్షల మంది వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానుల పేర్లు తొలగించారని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో తదనానంతరం చోటుచేసుకున్న పరిణామాలకు బయపడి నాయుడుబాబు ఏడుపు లంకించుకున్నాడని ఎద్దేవా చేశారు.

సాకులు వెతుక్కుంటూ..
ఓటమికి తండ్రీ కొడుకులు సాకులు వెతుక్కుంటున్నారని, బీహార్ ముఠా అని, అక్కడి కుల విభజనలను ఇక్కడ సృష్టించాలని చూస్తున్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ప్రశాంత్ కిశోర్ కూడా కలలోకి వస్తున్నాడా? అని నిలదీశారు. అయినా కులగజ్జిలో చిక్కుకున్న వారికి అందరూ అలాగే కనిపిస్తారని వెల్లడించారు.

5వేల టన్నుల ఎర్ర చందనం వేలంతో వేల కోట్ల ఆదాయం వస్తుందని కథలు చెప్పారని, కానీ వేలం వేస్తే రూ.856 కోట్లు వచ్చాయన్నారు. వేలంలో పాల్గొన్నవారు వెనక్కు తగ్గినట్టు కథలు చెబుతున్నారని మండిపడ్డారు. చివరకు జరిగిందేమిటంటే ప్రభుత్వ పెద్దలే స్మగ్లర్ల అవతారం ఎత్తారని, ఖజానా ఆదాయం వారి జేబుల్లోకి చేరిందన్నారు.

అవినీతికి జేజమ్మ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనన్నారు. దేశంలోనే అత్యంత కరప్ట్ నేత అంటూ తెహెల్కా పత్రిక కవర్ స్టోరీ వేసిన విషయాన్ని చంద్రబాబు మర్చి పోయారా? అని ప్రశ్నించారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసి ప్రజా ధనాన్నిదోచుకుంటూ పచ్చ చొక్కాలకు మేపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పసిపిల్లలకు కూడా చంద్రబాబు జాతకం తెలుసన్నారు.

మరిన్ని వార్తలు