‘కోడెల ట్యాక్స్‌ పుట్ట బద్దలవుతోంది’

14 Jun, 2019 10:36 IST|Sakshi
కోడెల విజయలక్ష్మీ, శివప్రసాదరావు, శివరాం (ఫైల్‌ ఫొటో)

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, అమరావతి : ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ‘కే ట్యాక్స్‌’  పుట్ట బద్దలవుతోందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా కోడెల కుటుంబ అక్రమాలపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. కొడెల కొడుకు, కూతురు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్‌పై ఎబెట్‌మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. కేట్యాక్స్‌ బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని గతంలో పిలుపునిచ్చిన విజయసాయిరెడ్డి.. కోడెల కుటుంబం వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 

మరో ట్వీట్‌లో.. ‘ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 56 వేల మంది ఉద్యోగులు ఇక నిశ్చింతగా ఉండగలుగుతారు. గతంలో రైల్వేలను విలీనం చేయడం కంటే ఇది సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.’ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

‘కే’ట్యాక్స్‌ బాధితుల ఫిర్యాదుల మేరకు కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మిలపై ఇప్పటికే పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బూలు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారని ఈ ఇద్దరిపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరాం, విజయలక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నారు. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

చదవండి:
‘కే ట్యాక్స్‌’పై ఐదు కేసులు

కోడెల కుమార్తెపై కేసు

కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు

మరిన్ని వార్తలు