రంగంలోకి దిగిన కెప్టెన్‌

8 Oct, 2017 12:58 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ స్పందించారు. పళనిస్వామి సర్కారు బలం నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీలోకి పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ బన్వారిలాల్‌ పురోహిత్‌ను కోరారు. చెన్నై రాజ్‌భవన్‌లో శనివారం కొత్త గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

‘గత ఏడాది కాలంలో రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడింది. ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ప్రజలను, రాష్ట్రాన్ని మోసపుచ్చుతూ పాలకులు కాలక్షేపం చేస్తున్నారు. డెంగీ జ్వరాల విశ్వరూపం, శాంతి భద్రతల సమస్య, అన్నదాతల ఆవేదనలు, రేషన్‌ దుకాణాల్లో సరుకుల కొరత వంటి సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన అధికార పార్టీ నేతలు తమ పదవులను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా వ్యవహరిస్తారని గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేపుడు మీరు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం సమర్పిస్తూ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామ’ని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం అని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఈ సందర్భంగా కలిసిన మీడియాతో విజయకాంత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు