రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు ఎక్కువగా ఉండాలి

30 Nov, 2019 05:48 IST|Sakshi

రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై చర్చలో విజయసాయిరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక అంశాల్లో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభలో ‘కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చిన రాష్ట్రాల అంశాలు తిరిగి రాష్ట్రాల జాబితాలో చేర్చాలి’ అంటూ తమిళనాడు ఎంపీ వైకో చేసిన ప్రైవేటు తీర్మానంపై చర్చ జరిగింది. దీనిపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రాలు కేంద్రం నుంచి అధికారాలను లాక్కునేందుకు ఆసక్తిగా లేవు. కేవలం ఆర్థిక అధికారాల విషయంలోనే వాటి డిమాండ్లు ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలున్నాయి. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన నిధులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని చెబుతున్నా.. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆ మేరకు రద్దు చేసిన విషయం మరవొద్దు. కేంద్ర న్యాయమంత్రి రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక అధికారాలు ఇచ్చేలా తగిన మార్గదర్శకాలు రూపొందించాలి..’ అని కోరారు.

రూ.2,246 కోట్ల నరేగా బకాయిలు విడుదల చేయండి 
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రాష్ట్రానికి రావలసిన రూ.2,246 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ఆయన ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ ఏడాది రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని, కొన్ని నెలలపాటు దుర్భిక్షం, తర్వాత ఎడతెగని వర్షాలు ముంచెత్తాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ఆదాయమే దిక్కు అయిందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి ఈ పథకం కింద విడుదల కావలసిన నిధులు సకాలంలో అందడం లేదన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్, పాలనా చెల్లింపుల పద్దు కింద చెల్లించాల్సిన రూ.2,246 కోట్లు విడుదల చేయకుండా కేంద్రం బకాయి పెట్టడం వల్ల ఉపాధి హామీ పథకం కింద సకాలంలో గ్రామీణ ప్రజలకు పనులు కల్పించలేని పరిస్థితులున్నాయన్నారు.

ఏపీలో యూరియా కొరతే లేదు
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అవసరానికి తగినంత సరఫరా చేయడానికి యూరియా సిద్ధంగా ఉందని, ఎరువుల కొరతే లేదని ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానందగౌడ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2017–18లో రాష్ట్రంలో 15.50 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా 14.09 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, 2018–19లో 16.70 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా 14.18 లక్షల మెట్రిక్‌టన్నుల విక్రయాలు జరిగాయని మంత్రి తెలిపారు. 2019–20లో 17.50 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. 

ప్రైవేటు మెంబర్స్‌ బిజినెస్‌ బుధవారానికి మార్చాలి
లోక్‌సభలో ప్రైవేటు మెంబర్స్‌ బిజినెస్‌ను శుక్రవారం నుంచి బుధవారానికి మార్చడం ద్వారా ప్రాధాన్యత కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు సభాపతిని కోరారు. ప్రైవేటు మెంబర్స్‌ బిజినెస్‌కు ముందు ఆయన ఈ అంశంపై మాట్లాడారు. అలాగే జీరోఅవర్‌లో కనీసం 30 మందికి అవకాశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

అనకాపల్లిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలి
అనకాపల్లి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ బీశెట్టి వెంకట సత్యవతి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆమె లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. వడ్డాది–మాడుగుల ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని కోరారు.

జీవిత బీమా ప్రీమియం నుంచి జీఎస్టీని మినహాయించాలి
జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు జీఎస్టీ వర్తింపజేయరాదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగ గీతావిశ్వనాథ్‌ కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆమె ఈ విషయమై జీరో అవర్‌లో మాట్లాడారు. పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ఆర్థిక మదుపు చర్యలను, జీవిత బీమాను ప్రోత్సహించాలని కోరారు.

భద్రాచలం–కొవ్వూరు రైల్వే లైన్‌ త్వరితగతిన నిర్మించండి
భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు రైల్వేలైను నిర్మించాలన్న డిమాండ్‌ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన లోక్‌సభ జీరోఅవర్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో కొంత వ్యయం భరించాలని కేంద్రం చెబుతోందని, అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉందని వివరించారు. ప్రత్యేక కేసుగా పరిగణించి ఈ రైల్వే లైను నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖను కోరారు. 

గణేషుడి విగ్రహాల తయారీలో విషతుల్య పదార్థాల నిషేధం అమలవడం లేదు
వినాయక చవితి కోసం రూపొందించే గణేషుడి విగ్రహాల తయారీలో విషతుల్యమైన పదార్థాలను నిషేధించి తొమ్మిదేళ్లయినా సక్రమంగా అమలుకావడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విషతుల్య పదార్థాల వినియోగం నిషేధాన్ని ఎందుకు పటిష్టంగా అమలు చేయడం లేదని ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి పర్యావరణ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను జారీ చేసిందని, రాష్ట్రాలు ఈ మేరకు నడుచుకుంటున్నాయని తెలిపారు. ప్రజలు ఇప్పుడు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ఉపయోగించడం లేదని, మట్టితోనే సహజసిద్ధమైన విగ్రహాలు తయారు చేస్తున్నారని వివరించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇంతేనా?

ఇంత‌కీ క‌రోనా పోయిన‌ట్టేనా: ఒమ‌ర్‌

సిగ్గులేకుండా తప్పుడు ఆరోపణలు : బొత్స

‘పొరుగు రాష్ట్రంలో కూర్చుని రాళ్లు విసరడం కాదు’

‘ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి’

సినిమా

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌