వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?

23 Jun, 2020 15:59 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ సానుభూతిపరుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. పార్క్‌ హయత్‌లో దుష్ట చతుష్టయంలోని ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారని.. వారితో మాట్లాడిన నాలుగో బిగ్‌ బాస్‌ ఎవరని ప్రశ్నించారు. అతి త్వరలో మరిన్ని వివరాలు.. అని పేర్కొన్నారు.(చదవండి : నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్‌)

‘పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?. మరిన్ని వివరాలు అతి త్వరలో...’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ నిమ్మగడ్డపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇరువురు నేతలతో ఈ నెల 13 ఆయన భేటీ కావడం పలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. నిమ్మగడ్డ టీడీపీ సానుభూతిపరుడంటూ తొలి నుంచి వస్తున్న వార్తలు నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వీరు భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.(చదవండి : ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ)

చంద్రబాబు కుట్రలో భాగం : మంత్రి వెల్లంపల్లి
ఈ భేటీకి సంబంధించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఏమిటనేది ఈ వీడియోతో తెలిపోందన్నారు. ఇన్నాళ్లుగా వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్నవి ఆరోపణలు కావని, నిజాలని రుజువైందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలో ఇదంతా భాగమని విమర్శించారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు బీజేపీ నేతలు కాదని.. వారు బాబు జనతా పార్టీ నాయకులను ఎద్దేవా చేశారు. వారిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్మగడ్డ నిజ స్వరూపాన్ని కోర్టులకు వివరస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు