‘ఎంత పెద్దవారైనా క్రమశిక్షణా చర్యలు తప్పవు’

24 Jun, 2020 19:15 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: పార్టీ నియమాలను ఎవరు ఉల్లంఘించినా, ఎంత పెద్దవారైనా క్రమశిక్షణా చర్యలు తప్పవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాలో మాట్లాడిన వ్యవహారాలపైనే షోకాజ్ నోటీస్ ఇచ్చామని తెలిపారు. బుధవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇతర ఎంపీల‌కంటే ఎక్కువే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రఘురామ కృష్ణంరాజుకి విలువ ఇచ్చారని గుర్తు చేశారు.

సీఎం వైఎస్ జగన్ వల్లే ఆయనకు పదవులు లభించాయని అన్నారు. పార్టీ నియమాలను పాటించకపోవడం వల్లే రఘురామ కృష్ణంరాజుకి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా పార్టీకలతీతంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అసభ్యకరంగా మహిళల పట్ల పోస్టులు పెట్టడం వల్లే చర్యలు తీసుకున్నామని, అసభ్యకరంగా కాకుండా విమర్శనాత్మకంగా ఉంటే ఫరవాలేదని అన్నారు.

డీజీపీకి లేఖ రాశాం
‘నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి గతంలో ఒక రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు. రాజ్యాంగ బద్ద పదవికి నిమ్మగడ్డ అనర్హుడు. చంద్రబాబు డైరక్షన్‌లోనే నిమ్మగడ్డ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరగాలి. విచారణ చేయాలని గతంలోనే డీజీపీకి లేఖ రాశాం. టీడీపీ ఎంపీ రాసిన లేఖనే నిమ్మగడ్డ కేంద్రానికి పంపారని గతంలోనే ఆరోపించా. సుజనాతో నిమ్మగడ్డకి ఏం పని. సుజనా చౌదరికి, నిమ్మగడ్డ మధ్య ఏం వ్యాపార లావాదేవీలు ఉంటాయి’అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
(చదవండి: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు)

మరిన్ని వార్తలు