ఆధికారంపై దురాశతోనే టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు 

13 Sep, 2018 04:22 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం కేవలం అవకాశవాదమే కాదు, అపవిత్రం కూడా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు అవకాశవాదమే కాదు, అది అపవిత్రమైనది కూడా. ఆ రెండు పార్టీలనూ ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా స్థాపించారో వాటిని సమాధి చేసి కేవలం అధికారంపై దురాశతోనే ఈ అవకాశవాద పొత్తుకు పూనుకున్నారు. సోనియాగాంధీ జాతీయత పేరుతో విదేశీయురాలు అని చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేసి ఇంకా రెండేళ్లయినా కాలేదు. అంతెందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకుంటానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇటీవలే ప్రకటించారు. ఈ అవకాశవాద పొత్తును చూస్తే అధికారం కావాలనే స్వార్థం తప్ప నైతికతలు వారికి పట్టవు అనిపిస్తోంది.   

రామాయపట్నం పోర్టునూ త్యాగం చేస్తారా? 
విభజన చట్టం హామీ మేరకు ఏపీలో కేంద్రం మరో మేజర్‌ పోర్టును నిర్మించాలి. దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు లాభసాటి కాదు.. ప్రతిగా రామాయపట్నంలో కడతాం అని కేంద్రం ముందుకు వస్తే దానికి సమీపంలోని కృష్ణపట్నం ప్రైవేట్‌ పోర్టుకు నష్టం వాటిల్లకుండా కాపాడేందుకు రామాయపట్నం పోర్టును నాన్‌ మేజర్‌ పోర్టుగా మార్చేసి కేంద్ర సాయాన్ని కూడా త్యాగం చేస్తారా? ఏమిటీ దుర్మార్గం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను బలి చేస్తారా.. చంద్రబాబూ? 

పోలవరంలో గ్యాలరీ వాకా...! 
పోలవరం స్పిల్‌ వే పనుల్లో నాణ్యత నాసిరకంగా ఉందని కేంద్ర నిపుణుల కమిటీ చెబుతున్నా.. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో ఈ రోజు చంద్రబాబు కుటుంబ సమేతంగా పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌వే గ్యాలరీ వాక్‌ పేరిట భారీ షో నిర్వహించారు. ఆ మధ్య పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ అనే మెగాషో కూడా చేసినట్లు గుర్తు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు