ఆడబిడ్డల సమాచారం టీడీపీ గూండాల చేతిలో ఉంది

1 May, 2019 04:28 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

డేటా దొంగ చంద్రబాబే

ఆధార్‌ సంస్థ ద్వారా దొంగిలించిన సమాచారాన్ని ‘ఈ–ప్రగతి’కి చేర్చారు

అక్కడి నుంచి టీడీపీకి చెందిన ‘సేవామిత్ర’ యాప్‌నకు బదిలీ చేశారు

ఏపీలోని ఆరు కోట్ల మంది వివరాలు సేవామిత్ర యాప్‌లో ఉన్నాయి 

సేవామిత్రలో స్టోర్‌ చేసిన డేటాను పార్టీ ప్రయోజనాల కోసం వాడుకున్నారు

టీడీపీపై అసంతృప్తితో ఉన్నవారి ఓట్లను ఫారం–7 ద్వారా తొలగించారు

కౌంటింగ్‌ రోజున ఈవీఎంలను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

ఐటీ గ్రిడ్స్‌ అశోక్‌ ఢిల్లీలో హ్యాకర్లతో సమావేశమై దీనిపై చర్చించారు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు ప్రజలకు సంబంధించిన అత్యంత విలువైన సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగిలించి, అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రతి కుటుం బంలోని ఆడపిల్లలు, మహిళలు, ఇతరులకు చెందిన సున్నితమైన సమాచారం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గూండాల వద్ద ఉందని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆడపిల్లల ఫోన్‌ నెంబర్లు, ఆధార్‌ నెంబర్లతో పాటు ఆయా కుటుంబాల బ్యాంకు ఖాతాల వివరాలు టీడీపీ ముఠా వద్ద ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటాను ఎలా సేకరించారో సవివరంగా మీడియాకు వివరించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎంలు) హ్యాకింగ్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే... 

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరిధిలోని ‘ఈ–ప్రగతి’ని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు లింకు చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జె.సత్యనారాయణ ఏపీలో పనిచేసిన అధికారి కాబట్టి ఆయన సహకారంతో 2016 నుంచి ఆధార్‌ డేటాను చంద్రబాబు దొంగిలిస్తున్నారు. ఆధార్‌ సంస్థ ద్వారా అక్రమంగా దొంగిలించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తొలుత ఈ–ప్రగతికి, తర్వాత ఈ–ప్రగతి నుంచి టీడీపీ యాప్‌ ‘సేవామిత్ర’కు బదిలీ చేశారు. సేవామిత్రలో స్టోర్‌ చేసిన డేటాను టీడీపీకి ఉపయోగపడేలా చేశారు. ఏపీలోని ఆరు కోట్ల మందికి సంబంధించిన మొత్తం సమాచారం, కుటుంబ సభ్యులు, ఆడపిల్లల వివరాలు సేవామిత్ర యాప్‌లో ఉన్నాయి. సేవామిత్ర యాప్‌ను దాకవరపు అశోక్‌ అనే వ్యక్తి ఎండీగా ఉన్న ‘ఐటీగ్రిడ్స్‌’ అనే సంస్థ రూపొందించింది. 

ప్రతి కదలికపై ‘సేవామిత్ర’ నిఘా 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవామిత్ర యాప్‌లోని ఫోన్‌ నంబర్ల లొకేషన్లు కనిపెట్టవచ్చు. ఎవరు ఎక్కడున్నారో ట్రాక్‌ చేయొచ్చు. ఎవరు ఎక్కడికి వెళ్లేది తెలుసుకోవచ్చు. ఫోన్లలో స్టోర్‌ చేసిన సమాచారాన్ని కనుక్కోవచ్చు. ఫోన్లలో ఉన్న సమాచారాన్ని తొలగించే సౌలభ్యం కూడా సేవామిత్ర యాప్‌నకు ఉంది. ప్రతి సెల్‌ఫోన్‌లో ఉండే ఐఎంఈఐ నెంబర్లను ఐటీగ్రిడ్స్‌ సంస్థ సేకరించింది. వినియోగదారులు సిమ్‌కార్డును మార్చినప్పటికీ ఫోన్‌ను సెర్చ్‌ చేయడానికి ఐఎంఈఐ నెంబర్లను సేకరించారు. అంతేకాకుండా మైక్రోఫోన్‌ ఆడియో రికార్డింగ్‌ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసేందుకు వీలవుతుంది. ఎక్కడి నుంచైనా అపరిచితులు ఫోన్‌ చేస్తే చంద్రబాబు డేటాబేస్‌ దొంగలు ఈ పనికి ఒడిగట్టినట్లు భావించాలి. 

సర్వర్‌ సంగతి త్వరలో బయటపెడతాం.. 
ఏపీ ఆన్‌లైన్‌కు ఫోన్‌ చేస్తున్న పౌరుల వివరాలను సేకరించి సేవామిత్ర యాప్‌నకు బదలీ చేశారు. ఏపీలో ఉన్న కుటుంబాల సమాచారం మొత్తం ఈ యాప్‌లో దాచిపెట్టారు. ఈ డేటాను ఏ సర్వర్‌లో స్టోర్‌ చేశారన్న సంగతిని త్వరలోనే బయటపెడతాం. అసలు ప్రైవేట్‌ సర్వర్‌లో ఈ డేటాను ఎందుకు దాచిపెట్టారన్న సంగతిని బహిర్గతం చేస్తాం. ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయాలని భావిస్తున్నారు? టీడీపీ మద్దతుదారులెవరు? అసంతృప్తి వాదులు ఎవరు? అనే సమాచారాన్ని సేవామిత్ర యాప్‌ ద్వారా సేకరించారు. ప్రతి ఇంటికీ నాలుగైదు సార్లు వెళ్లి సర్వేలు నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచిన వ్యక్తుల డేటాను సేకరించి, ఫారం–7 ద్వారా వారి ఓట్లను తొలగించారు. 

బినామీలే డ్యాష్‌బోర్డు నిర్వహణ 
సీఎం డ్యాష్‌బోర్డును తానే కనిపెట్టినట్లు చంద్రబాబు పోజులు కొట్టారు. వాస్తవానికి ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉంది. అప్పట్లో సమర్థవంతంగా పని చేసింది. దీని తరువాత డ్యాష్‌బోర్డు వెర్షన్‌–2ను చంద్రబాబు రాష్ట్రపతి చేత ఆవిష్కరింపజేశారు. అది కొద్ది రోజులకే పని చేయకుండా పోవడంతో వైఎస్సార్‌ హయాంలోని వెర్షన్‌–1 మాత్రమే దిక్కయ్యింది. ఈ డ్యాష్‌బోర్డును కూడా చంద్రబాబు బినామీలైన ఇద్దరు వ్యక్తుల కంపెనీయే నిర్వహిస్తోంది. డేటా స్టోరేజీ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించే సదుపాయం అమల్లో ఉంది. చంద్రబాబు ఈ సౌలభ్యాన్ని ఎందుకు ఉపయోగించడం లేదు? ఈ–ప్రగతి కోసం కేంద్ర సాయం ఎందుకు కోరలేదు? కల్యాణ్‌ సుధీర్‌ అనే చంద్రబాబు బినామీకి డేటా సెంటర్‌ కాంట్రాక్టును ఎందుకు ఇచ్చారు? ఇది అధికార దుర్వినియోగం కాదా?  

‘అభయ’తో ఎంతమందిని రక్షించారు? 
ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం భార్యకు ఆర్‌కే సొల్యూషన్స్, ఓటీపీఎస్‌ అనే రెండు ప్రైవేట్‌ సంస్థలున్నాయి. వీరికి సంబంధించిన సంస్థే రవాణా శాఖకు చెందిన ఆర్టీఐ యాప్‌ను రూపొందించింది. పారదర్శకత లేకుండానే ఈ కాంట్రాక్టును ప్రభుత్వం ఇచ్చింది. ఓటీపీఎస్‌ సంస్థ తనకు దక్కిన కాంట్రాక్టు ఆధారంగానే ‘అభయ’ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.188 కోట్లు విడుదల చేసింది. అభయ యాప్‌ ద్వారా ఏ మేరకు నేరాలను నిరోధించగలిగారు? ఎంతమంది మహిళలను రక్షించారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. చంద్రబాబు దొంగిలించిన ఆధార్‌ డేటాను వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో కూడా ఉపయోగించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రయోజనాలు దక్కిన కుటుంబాలు, టీడీపీకి అనుకూలంగా లేని కుటుంబాల వివరాలను సేకరించారు. ఈ సమాచారాన్ని టీడీపీ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు.  

ఇప్పటికీ దాకవరపు అశోక్‌ అక్రమాలు 
ఐటీగ్రిడ్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దాకవరపు అశోక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారని అంటున్నారు. కానీ, ఆయన నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో హ్యాకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు రోజున ఏ విధంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎంలు) వివరాలను హ్యాక్‌ చేయాలనే దానిపై హ్యాకర్ల సమావేశంలో చర్చించారు. పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. దాకవరపు అశోక్‌ ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతున్నారు. 

శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించడం వెనుక బాబు హస్తం
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యం ముందు బాగానే కనిపించింది. ఇప్పుడేమో అనారోగ్యం అంటున్నారు. అతడు చనిపోయే స్థితికి చేరుకుంటున్నాడు. దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉంది. శ్రీనివాసరావుకు, రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌కు మధ్య ఉన్న సంబంధాలపై వాస్తవాలను దాచిపెడుతున్నారు. ఈ వ్యవహారంలో కూడా చంద్రబాబు పాత్ర ఉంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఇంటిపై జరిగిన సీబీఐ దాడులకు, పార్టీకి మధ్య ఎలాంటిసంబంధం లేదు. బహుశా సమాచారం ఇవ్వలేదని సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వచ్చినట్లున్నారు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  

‘ఐటీగ్రిడ్స్‌’ అశోక్‌కు నారా లోకేశ్‌ అండ 
ప్రజలకు చెందిన విలువైన డేటాను చంద్రబాబు దుర్వినియోగం చేసే అవకాశం ఉండడమే కాదు, దీన్ని విదేశాలకు కూడా అమ్ముకోవచ్చు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వల్లే ఏపీ ప్రజల డేటా ఐటీగ్రిడ్స్‌ సంస్థకు చేరింది. ఈ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దాకవరపు అశోక్‌.. నారా లోకేష్‌ బినామీ. అందుకే అశోక్‌ను అరెస్టు కాకుండా కాపాడుతున్నారు. ఐటీగ్రిడ్స్‌పై పోలీసులు దాడి చేసిన తరువాత కూడా డేటాను ఈ సంస్థ అప్‌డేట్‌ చేసినట్లు మాకు సమాచారం ఉంది. అశోక్‌ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఆయన ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఎందుకు దాక్కున్నారు? ఐటీగ్రిడ్స్‌ డేటా చౌర్యం గురించి విచారణ జరిపే బాధ్యతను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ‘సిట్‌’కు అప్పగించారు. ఆ ‘సిట్‌’ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిందా? ఇస్తే అందులో ఏం పొందుపర్చారు? ఎవరిని దోషిగా నిర్థారించారు? అనే విషయాలను చెప్పాల్సిన బాధ్యత ‘సిట్‌’పై ఉంది. 

మరిన్ని వార్తలు