ఆ రెండు పార్టీల కుమ్మక్కుకు నిదర్శనమిదే..

18 Jul, 2018 03:39 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను అఖిల పక్ష భేటీకి పిలవడమేంటి?

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజం

పునర్విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాలి

ఫిరాయింపు నిరోధక చట్టానికి సవరణ తీసుకురావాలి

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయని, అందుకే అఖిలపక్ష సమావేశానికి ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను పిలిచారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు ప్రధాన మంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. మా పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకను లోక్‌సభలో మా పార్టీ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినట్లు బోర్డులో పెట్టారు. సమావేశం ప్రారంభం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ను ప్రశ్నించాను. పార్టీ ఫిరాయించి, అమ్ముడుపోయిన ఎంపీని మీరు ఏ అధికారంతో పిలిచారు. ఒక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మీకు ఇది న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించాను. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విషయాన్ని చెప్పాను.

ఆయన దానికి బదులిస్తూ స్పీకర్‌ ఇంకా అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, మీ పార్లమెంట్‌ సభ్యులు రాజీనామా చేశారు కాబట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుల్లో ఉన్న ఆమెను మీ ప్రతినిధిగా పిలిచానని ఆయన అన్నారు. దానికి నేనొక్కటే చెప్పాను. మీరు ఆ నేమ్‌ ప్లేట్‌ను తీసేస్తారా? సమావేశాన్ని బహిష్కరించమంటారా? మీరే నిర్ణయించుకోండి... అని చెప్పాను. మా పార్టీ అధ్యక్షుడు ఏదైనా అధీకృత లేఖ మీకు ఇచ్చారా? బుట్టా రేణుకను పార్లమెంటరీ నాయకులుగా చేసినట్లు మీకు లేఖ ఏమైనా అందిందా అని ప్రశ్నించాను.

ఆ సమయంలో విపక్షాలన్నీ మమ్మల్ని సమర్థించాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చేసిన చర్య తప్పని ప్రతిపక్షంలో ఉన్న ప్రతిఒక్కరూ గర్హించారు. నేమ్‌ ప్లేట్‌ తీసివేయని పక్షంలో సమావేశాన్ని బహిష్కరిస్తామన్న పలువురు బలపరచడంతో బోర్డును ఉపసంహరించుకున్నారు..’ అని పేర్కొన్నారు. ‘ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందే. బీజేపీ, టీడీపీ కుమ్మక్కయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. మా పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్లలో ఇంకా ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఎందుకు బుట్టా రేణుకనే పిలిచారు. అందుకే ఇందులో టీడీపీ పాత్ర ఉందని నేను చెబుతున్నా..’ అని పేర్కొన్నారు.

నాలుగు అంశాలపై..
‘అఖిలపక్ష సమావేశంలో నాలుగు అంశాలను ప్రధాన మంత్రి సమక్షంలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఇందాక మీడియాతో మాట్లాడారట. వీలైతే అమలు చేయండి అని నేను అన్నట్టుగా చెప్పారట. ఆయనకు తెలుగు పూర్తిగా రాదు.. ఇంగ్లీష్, హిందీ అసలే రాదు. నాటు సారా అమ్ముకునే వ్యక్తిని టీడీపీ పార్లమెంటు సభ్యుడిగా చేస్తే ఆయనకు ఇంతకన్నా ఏరకంగా అర్థమవుతుంది? ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలను, పొందుపరచని అంశాలను ముఖ్యంగా ప్రత్యేక హోదా అమలు చేయాలన్న అంశాన్ని ప్రధానమంత్రికే చెప్పాను. దానిపై ఆయన స్పందించలేదు.

ఇక రెండో అంశం విశాఖ–చెన్నై కారిడార్‌ పూర్తయినట్టుగా టీడీపీ చెప్పుకుంటోంది. ఆ కారిడార్‌ ఎక్కడుందో నాకైతే అర్థం కావడం లేదు. పోలవరంలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించడం ఎందుకు? దానిలో కోటానుకోట్ల అవినీతికి పాల్పడుతున్న ఈ సీఎం తప్పకుండా చట్టానికి లోబడి ఏదో ఒక రోజు జైలుకు పోవాల్సి వస్తుంది. ఇక బీసీలకు జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాన మంత్రిని కోరాను. మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణం చట్టం చేయాలని కోరాను. విశాఖ రైల్వే జోన్‌ను ఏపీ విభజన చట్టంలోనే పొందుపరిచారు. అయినా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదన్న విషయం ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లా..’ అని వివరించారు.

ప్రధానికి నేరుగా నివేదించా..
‘బుట్టా రేణుక విషయాన్ని కూడా నేరుగా ప్రధాన మంత్రికి నేరుగా నివేదించా. దుర్వినియోగం అవుతున్న ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యంగా సవరణ తీసుకురావాలని, స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధించాలని కోరా. ఆలోగా నిర్ణయం తీసుకోనిపక్షంలో కోర్టుకు వెళ్లే అవకాశం ఉండాలని కోరాను. ఈ అంశాలన్నీ కూడా ప్రజాసమస్యలపై టీడీపీ ప్రధాన మంత్రి దృష్టికి గానీ, అఖిలపక్ష సమావేశం దృష్టికి గానీ తీసుకురాలేదు. వాళ్లకు సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడికి ఇంగ్లీష్‌ అర్థం కాదు. ఆయన కుమారుడికి తెలుగు కూడా సరిగా రాదు.

అటువంటి వాళ్లు సీఎం రమేష్‌ వంటి వాళ్లను పార్లమెంటుకు పంపిస్తే ఏరకంగా అర్థం చేసుకుంటారు? ప్రజాసమస్యలను ఎలా చర్చిస్తారు?’ అని పేర్కొన్నారు. ‘టీడీపీకి ప్రజల సమస్యలపట్ల చిత్తశుద్ధి లేదు. వారు రాబోయే ఎన్నికల దృష్ట్యా డ్రామాలు ఆడుతున్నారు. ప్రత్యేక హోదా సాధించే ఉద్దేశం ఉంటే ఈదుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతోంది. ఆ పోరాటం కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానాలు రానున్నాయి కదా.. సభ సజావుగా నడుస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘మా పార్టీ నుంచి వెళ్లిపోయిన దొంగలు, టీడీపీ దొంగలు కలిసి ఉభయ సభల్లో 26 మంది ఉన్నారు. ఇదొక గణనీయమైన సంఖ్య. ఈ తెలుగు దొంగల పార్టీ సభ్యులు ఏం చేస్తారన్న విషయం మీద పార్లమెంటు సమావేశాలు సజావుగా నడుస్తాయా? లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ దొంగలంతా ప్రతిపక్ష నేతలందరినీ కలిశారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగింది? ఏం చేయబోతున్నారన్న సంగతి సభ ప్రారంభమైన తరువాతే తెలుస్తుంది..’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు