'బాబు ఆ రోజైనా రాజకీయ సన్యాసం ప్రకటించు'

13 May, 2020 19:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్‌లో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాసరావుల బృందం పర్యటించింది. గ్యాస్‌ లీకేజీ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి చెక్‌లను అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, డీఆర్వో శ్రీదేవి, కేజీహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు తీసుకెళ్లడం చంద్రబాబుకు ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. జీవో నంబర్‌ 203పై ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అభిప్రాయం చెప్పాలన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. చదవండి: అస‌లు చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ బిడ్డేనా..!

అమరావతిలో తన బినామీల ఆస్తులు కాపాడాలన్నదే చంద్రబాబు తాపత్రయం అన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఎల్లో మీడియా విశాఖపై విష ప్రచారం చేస్తోందన్నారు. అధికారం కోసం ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను చంద్రబాబు లాక్కున్నారన్నారు. కరోనాను చూసి చంద్రబాబు భయపడటం లేదన్నారు. కరోనానే చంద్రబాబును చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా చంద్రబాబు  అనధికారికంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు.

ఈ నెల 28న ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగానైనా అధికారికంగా చంద్రబాబు రాజకీయ సన్యాసం ప్రకటించాలని సూచించారు. కరోనాకు టీకా వచ్చే వరకు హైదరాబాద్‌ ఇళ్లు వదిలి రారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులపై ఏం మాట్లాడారో చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీని రాష్ట్రానికి రావద్దని చంద్రబాబు అనలేదా' అంటూ నిలదీశారు. చదవండి: ఈ కమిటీలన్నీ చంద్రబాబు చెబితే వేశారా?

మరిన్ని వార్తలు