మే 23 తర్వాత డేటా దొంగలంతా జైలుకే..

20 Apr, 2019 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసు తీగ లాగితే డొంకంతా కదులుతోందని, ఏపీ తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారమే కాకుండా  పంజాబ్‌ పౌరుల సమాచారం కూడా దొంగలించారని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ గూఢచార సంస్థ కంటే ప్రమాదకరంగా రహస్య సమాచార దోపిడీ జరిగిందని అన్నారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా కటకటాల వెనక్కే అని వ్యాఖ్యానించారు.

ఓవైపు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోట్లలో బిల్లుల చెల్లింపులు చేస్తున్న అధికారులు సీఎస్‌ పునేఠాలాగే ఇబ్బంది పడతారని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, ఆపద్ధర్మ సిఎం చేసిన బదిలీలను రద్దు చేయాలని ఆయన కోరారు. నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, ప్రైవేట్‌ యూనివర్సిటీల సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ అడ్డుకున్నప్పుడే చంద్రబాబుకు తన ప్లాన్‌ ఫెయిలైందని అర్థమైందన్నారు.

ఆ తర్వాత తాను నియమించుకున్న ఆర్వోల మీద భారం వేశారని, అయితే ప్రజా తీర్పు మరోలా ఉండటంతో ఇప్పుడు ఈవీఎంలను బదనాం చేస్తున్నారని దుయ్యబట్టారు.’ అని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.  ‘కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి వెళ్లాడట. చంద్రబాబులాగా. ఇక్కడ ఈగల మోతను తప్పించుకోవడానికి రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేస్తున్నారు. చిత్రమేమిటంటే ఆయన స్నేహితులెవరూ స్పెషల్ స్టేటస్‌ ఊసే ఎత్తరు. ఈయన గాబరా పడ్డట్టు ఈవీఎంల పైనా మాట్లాడరు.’ అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు.

మరిన్ని వార్తలు