కేసీఆర్‌, కేటీఆర్‌లపై విజయశాంతి విసుర్లు

21 Aug, 2019 18:15 IST|Sakshi

గ్లోబరీనాపై గుటకలు మింగుతున్నారు..

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, సినీనటి విజయశాంతి విమర్శలు గుప్పించారు.  ఇంటర్‌​ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తమ ప్రభుత్వ తప్పిదం ఏమాత్రం లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో వ‍్యవహరించిందని, కానీ ఇప్పుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వివరణ కోరడంతో రక్షణలో పడిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ మీడియా నోరు నొక్కి గ్లోబరీనా వ్యవహారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసినా , ఇప్పుడు రాష్ట్రపతి వివరణ అడిగేసరికి గుటకలు మింగుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పిదాలు ఇవాళ కాకపోయినా రేపైనా వెలుగులోకి వస్తాయన్న విషయాన్ని తండ్రీకొడుకులు గుర్తుంచుకోవాలని విజయశాంతి హితవు పలికారు. తాను ఆణిముత్యం, తన కుమారుడు స్వాతిముత్యం అనుకుని మురిసిపోతే కుదరదని, కాలం మారడం ఖాయమని, జనం ఆలోచన, అభిమానం మారడం అంతకన్నా ఖాయమని ఆమె హెచ్చరించారు.

మరిన్ని వార్తలు