‘ఎవరి లెక్క ముందు తేలుతుందో చూడాలి’

9 Sep, 2019 18:50 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి(ఫైల్‌ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : గత బడ్జెట్‌ లెక్కలు తేలకముందే.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త బడ్జెట్‌ పేరుతో గారడీకి సిద్ధమయ్యారని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి అన్నారు. చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ.. కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమోనని ఎద్దేవా చేశారు. 2019-20 సంవత్సరానికి గానూ రూ. 1, 46,492.3 కోట్లతో సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రతిపాదించిన బడ్జెట్‌పై విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతేడాది కూడా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులతో టీఆర్‌ఎస్‌ సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. అయినప్పటికీ అక్షరాస్యతలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగులో ఉందని సర్వేలో తేలిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా కేసీఆర్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారని విమర్శించారు.

‘విష జ్వరాలు విజృంభిస్తున్నా.. ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం..ఆరోగ్యశ్రీ  బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వంటి నిర్లక్ష్య ధోరణితో.. కేసీఆర్‌ పేద రోగుల జీవితాలతో ఏ రకంగా  ఆడుకున్నారో అందరికీ అర్థమైంది. రైతులకు యూరియా అందించే విషయంలో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గత బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం... ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు’ అని ప్రభుత్వ తీరును విజయశాంతి ఎండగట్టారు. గతంలో కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ లెక్కా- పద్దుల విషయం ఏమోగానీ... గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారి ప్రకటనల ద్వారా అర్ధం అవుతోంది. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలి’ అని విజయశాంతి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు