‘కేసీఆర్‌ మాటలు.. బ్రహ్మానందం కామెడీ’

25 Mar, 2019 20:27 IST|Sakshi

సాక్షి, మెదక్: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నారని మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. మెదక్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ సింహగర్జన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ మంతా ప్రధానిగా మోదీ వద్దనుకుంటుంటే, కేసీఆర్ మాత్రం కావాలంటున్నారని విమర్శించారు. కేసీఆర్ మోదీ మనిషి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలు చూస్తుంటే బ్రహ్మానందం, ఆలీ కామెడీలా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 16 మంది ఎంపీలున్నా విభజన హామీలు సాధించలేకపోయారని ధ్వజమెత్తారు.

2014లో మెదక్‌కు మంచి జరుగుతుందని ఎమ్మెల్యేగా పోటీకి దిగితే కుట్రలు కుతంత్రాలతో తనను ఓడించినా తాను బాధ పడలేదన్నారు. గెలుపు, ఓటములు తనకు మామూలేనని చెప్పారు. గెలిచినా ఓడినా మెదక్ తన ఇల్లు లాంటిదన్నారు. మెదక్‌కు రైలు నేనే సాధించానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు బయటకు పోయినా ఏమీ కాదన్నారు. మెదక్ ఎంపీ, ఎమ్మెల్లే వసూల్ రాజా, వసూల్ రాణిగా మారారని విజయశాంతి దుయ్యబట్టారు.

సిరిసిల్లలో తాను ప్రచారం చేసి గెలిపించకపోతే కేటీఆర్ గెలిచేవాడా.. అప్పుడు దేవత, ఇప్పుడు దెయ్యం లా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ సీఎం అయ్యే వారా అని నిలదీశారు. కేసీఆర్ మాయమాటలతో కాలం గడుపుతారని విమర్శించారు. ప్రజలు ఆలోచించకపోతే  తమ గొయ్యి తాము తీసుకున్నట్టేనని హెచ్చరించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ తెలంగాణ ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు