బెజవాడలో ‘బొండా’.. అవినీతి కొండ

5 Apr, 2019 13:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ :  విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. నియోజకవర్గం మొత్తం కనుసైగతో శాసించేవారు. అధికారంలోకి వచ్చింది మొదలు భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో విచ్చలవిడిగా అక్రమాలు చేపట్టారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతికి పచ్చ జెండా ఊపింది.

దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఏదైనా పని జరగాలన్నా.. కాంట్రాక్టు దక్కాలన్నా ఆయన అనుమతి కావాల్సిందే. వీరికి కప్పం కట్టందే ఏ వ్యవహారం నడవదు. కాంట్రాక్టు పనైనా, ఉద్యోగమైనా ఏదైనా నగదు ముట్టజెప్పితే ఎలాంటి వ్యవహారమైన క్షణాల్లో సెటిల్‌ చేసేస్తారు. అధికారం అండతో ఐదేళ్లుగా బొండా ఉమామహేశ్వరరావు అక్రమ దందా కొనసాగించి రూ.కోట్లు కొల్లగొట్టారు. 

అక్రమాలు, అరాచకాలు

  • కండ్రిక కాలనీలో జర్నలిస్టులకు ఇళ్ల పేరుతో ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1720 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నిం చారు. స్థానికుల ఆందోళనతో వెనక్కుతగ్గారు.
  • 43వ డివిజన్‌లోని దుర్గాగ్రహారంలో క్యాన్సర్‌ బా«ధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన  అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ను ఎమ్మెల్యే అనుచరులు కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమా వెనుక ఉండి తన అనుచరులతో దౌర్జన్యం చేయించినట్లు సమాచారం.  
  • బొండా ఉమా ప్రధాన అనుచరుడు, కార్పొరేటర్‌ నందెపు జగదీష్‌ పాయకాపురంలో కళ్లం విజయలక్ష్మి, లంకిరెడ్డి సాంబిరెడ్డికి చెందిన సర్వే నెం.62/1, 62/2లో 0.49 సెంట్ల భూమికి సంబంధించి తప్పుడు వీలునామా సృష్టించి, తన పేర, తన కుటుంబ సభ్యుల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. బాధితులు కోర్టులో కేసు వేయడంతో దిగువ కోర్టులో కార్పొరేటర్‌ కేసు ఉపసంహరించుకున్నాడు. ఈ కబ్జా వ్యవహారం వెనుక ఉమా హస్తం ఉంది. స్థలం ప్రస్తుతం యజమాని చేతిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్స్‌ రద్దు కాలేదు. ఈ స్థలం విలువ రూ.10 కోట్లు ఉంటుంది. నందెపు జగదీష్‌ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. 
  • తెనాలికి చెందిన సుబ్బు అనే రౌడీ షీటర్‌తో బొండా ఉమామహేశ్వరరావు సంబంధాలు కొనసాగించారు. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ బొండా, మరికొందరు టీడీపీ నాయకుల పేర్లు చెప్పారు. తెలంగాణ పోలీసులు సుబ్బుపై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో రౌడీ షీటర్‌ సుబ్బు పట్టపగలు దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు సృష్టించారు. 
  •  ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని దాడికి యత్నించారు. అడ్డుగా వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గన్‌మెన్‌పై దాడి చేశారు. 
  • సత్యనారాయణపురంలోని కల్యాణ మండపాన్ని అధికార పార్టీ నాయకులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిం చి విఫలమయ్యారు. బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో  వెనక్కుతగ్గారు.
  • న్యూరాజరాజేశ్వరీపేటలోని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
  • పాయకాపురంలో రవీంద్ర థియేటర్‌ పక్కన ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన రూ.కోట్ల విలువైన భూములను తన ప్రధాన అనుచరుడు.. కార్పొరేటర్‌ జగదీ‹ష్‌తో కలిసి కాజేసేందుకు చూశారు.
  • పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతానికి చెందిన దాదాపు మూడు ఎకరాల వరకూ ఉన్న ఆ కాలనీ కామన్‌ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటికి ఇంటి పట్టాలను సైతం పుట్టిం చేందుకు యత్నించారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. 

అనుయాయుల తీరు అంతే.. 

  • ఇందిరానాయక్‌ నగర్‌లో బుడమేరుకు అనుకుని ఉన్న ఓ వ్యక్తి స్థలంలో నిర్మించిన ప్రహరీని దౌర్జన్యంగా కూలగొట్టి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులోనూ ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. 
  • ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరు గతంలో ఓ ఉపాధ్యాయురాలిని బెదిరించారు. అతను సివిల్‌ సప్లయ్‌ కార్యాలయంలోనూ చక్రం తిప్పి అక్రమాలకు పాల్పడ్డాడు.  
  • మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఘంటా కృష్ణమోహన్‌ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ఇతను ఓ వివాహితను లోబరచుకున్నాడు. ఆ రాసలీలల వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. 
  • సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం పూర్తిగా ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే పనిచేస్తుంటాయి. రికార్డులు తారుమారు చేసి, సదరు భూములను అనుచరుల పేర రిజిస్ట్రేషన్‌ చేయించిన దాఖలాలు ఉన్నాయి. 
  • సింగ్‌నగర్‌ ప్రాంతంలో వందల కొద్ది అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా కార్పొరేటర్లు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌లైతే రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వీటిలో ఎమ్మెల్యేకు వాటా వెళుతోంది. 

జాగా కనిపిస్తే పాగా 
ఎమ్మెల్యే బొండా, తన అనుయాయులైన కార్పొరేటర్లు అందిన కాడికి దోచుకోవటమే పరమావధిగా పనిచేస్తున్నారు. రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడు కలిసి వెంచర్‌ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరులోపలకి ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నారు.

ముత్యాలంపాడులో ఇరిగేషన్‌ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడు వ్యాయామశాల పెట్టుకోవడానికి ధారాదత్తం చేశారు. 44వ డివిజన్‌లో కార్పొరేటర్‌ రైల్వే, ప్రభుత్వ స్థలాలను సైతం విక్రయించారు. సదరు కార్పొరేటర్‌ హౌస్‌ఫర్‌ ఆల్‌ ఇళ్లను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. తాజాగా 46వ డివిజన్‌ అంబేడ్కర్‌ కాలనీలో కాల్వగట్టు స్థలాన్ని వ్యాయామశాల కోసం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు   సమాచారం. 

సింగ్‌నగర్‌లో కోట్ల విలువైన భూమి..
మాగంటి బాబు.. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడు. స్వాతంత్య్ర సమరయోధుని భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారిలో ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతో పాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమాకు అన్ని దందాల్లోనూ మాగంటి బాబే కీలకంగా వ్యవహరిస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. తాజాగా విజయవాడ సింగనగర్‌లోని రూ.30 కోట్లు భూదందాలో కూడా ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం.

వాస్తవానికి ఆ భూమిని 2005లోనే 21 మంది సామాన్యులు ప్లాట్లు రూపంలో కొనుగోలు చేశారు.  రాష్ట్ర విభజన అనంతరం భూముల ధరలు అమాంతంగా పెరగడంతో ఆ భూమి మార్కెట్‌ విలువ రూ.30 కోట్లకు చేరుకుంది. దీంతో టీడీపీ నేతల కన్ను ఆ భూమిపై పడింది. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడైన మాగంటి బాబుతోపాటు మరికొందరు ఆ భూమి తమదంటూ కొత్త వాదనను లేవదీశారు. మాగంటి బాబు, మరికొందరు 2015లో ఆ భూమిలోకి ప్రవేశించి ప్లాట్లుగా వేసి ఉన్న హద్దు రాళ్లను తొలగించేశారు.

తమ భూమిలో ఇతరులు ప్రవేశించడంపై ఆ 21 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా తాము ఆ భూమిని 2007లోనే కొనుగోలు చేశామని కొన్ని పత్రాలు చూపించ డంతో వారు హతాశులయ్యారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సింగ్‌నగర్‌ పోలీసులు ఆ భూమి ఆక్రమణదారులపై కేసు నమోదు చేయాల్సివచ్చింది.

కానీ వారంతా బొండాకు సన్నిహితులు కావడంతో పోలీసులు వారికే కొమ్ముకాస్తుండటం గమనార్హం. అసలు యజమానులు ఎన్నిసార్లు ఆ భూమిలో హద్దురాళ్లు పాతుతున్నా వెంటనే తొలగిస్తున్నారు. ఆ భూమిని చదును చేయాలని భావిస్తుంటే అడ్డుకుంటున్నారు. భూమిలోకి అడుగుపెడితే సహించేది లేదని బెదిరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు