బొండా, బోడే, కొల్లు తొలిసారితో సరి.. 

26 May, 2019 17:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : శాసన సభ్యులుగా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని జనానికి చేరువు కాకుండా రూ.కోట్ల సంపాదనపై దృష్టి పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరించారు. మంత్రులతో పాటు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రజలు  ఏ మాత్రం దయ చూపలేదు. అందర్ని ఓడించి ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని చూపించారు. పదవి అలంకారం కాదు.. బాధ్యతల సమాహారం అని భావించాల్సిన వారు అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. దౌర్జన్యం.. దోపిడీకి కొమ్ము కాయడంతో ప్రజలు ఎన్నికల సమరంలో ఓటు అనే ఆయుధంతో కుళ్లబొడిచారు. ‘మీ ప్రజా సేవ చాలులే’ అని ఓటుతో చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఘోర పరాజయానికి స్వయంకృతమే తొలి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన అవకాశాన్ని.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమవ్వడం వల్లే ఫలితాలు టీడీపీ అభ్యర్థులకు చేదు నిజాన్ని తెలియజెప్పాయి.  
 
స్వయంకృతాపరాధం
విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కొల్లు రవీంద్రకు తొలిసారి ఎన్నిక కాగానే మంత్రి పదవి వరించింది. అయినా ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. బొండా ఉమామహేశ్వరరావు ఐదేళ్లలో నియోజకవర్గాన్ని తన సొంత జాగీరుగా భావించి పెత్తనం సాగించారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములు కబ్జా, ఒక మహిళకు చెందిన ఇంటిని కబ్జా చేశారు. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మరణానికి కారణమయ్యారు. తన నోటి దురుసుకు కార్పొరేటర్లు కూడా ఆయన్ను చీదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ప్రచారం చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. చివరకు 25 ఓట్లు తేడాతో ఓడిపోయారు. బోడే ప్రసాద్‌ కూడా తన పదవీ కాలంలో ఇసుక దందాలు చేయడం, బిల్డర్ల వద్ద ముక్కుపిండి దందాలు చేశారు. దీంతో ఈసారి ప్రజలు ఆయన్ను పదవికి దూరం చేసి కె.పార్థసారథికి పట్టం కట్టారు. 

అవినీతే కొంప ముంచింది.. 
దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, జలీల్‌ఖాన్, వల్లభనేని వంశీమోహన్, మండలి బుద్ధ ప్రసాద్‌ తదితరులు అవినీతి ఊబిలో కూరుకుపోయారు.  నీరు–చెట్టు పథకం కింద రూ.కోట్లు కొల్లగొట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై కంటే ఆ పనుల్లో వచ్చే వాటాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఐదేళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే కనీసం రూ.100 కోట్లకుపైగా సంపాదించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మంత్రి ఉమా అయితే జలవనరుల ప్రాజెక్టుల నుంచి నీరు–చెట్టు పథకం వరకు ఎక్కడ అవకాశం వచ్చినా అడ్డంగా దోచేశారు. నియోజకవర్గానికి ఆయన చెప్పుకోదగిన పనులు ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఆయనకు షాక్‌ ఇచ్చారు. కొల్లు  రవీంద్ర మంత్రిగా చెప్పుకోదగిన ప్రతిభ కనబరచలేదు. కేవలం మంత్రిగానే కొనసాగారు తప్ప నియోజకవర్గానికి కానీ, జిల్లాకు గానీ ఆయన సాధించింది ఏమీ లేదు. దీంతో ఆయన్ను మచిలీపట్నం ప్రజలు తిరస్కరించారు. అవనిగడ్డ నుంచి డెప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం, రైతులకు సాగునీరు ఇప్పించలేకపోవడంతో ఆయనకు ఓటర్లు బాయ్‌.. బాయ్‌ చెప్పారు.  

మహిళా అభ్యర్థులకు నో చాన్స్‌
ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తంగిరాల సౌమ్య (నందిగామ), ఉప్పులేటి కల్పన (పామర్రు), షాబానా ఖాతూన్‌ (విజయవాడ పశ్చిమ) ఎన్నికల బరిలో దిగారు. ఇందులో తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు. వీరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఖాతూన్‌ తండ్రి జలీల్‌ఖాన్‌ పార్టీ ఫిరాయించడం, వక్ఫ్‌ ఆస్తులపై కన్నేయడంతో ఆమెను ప్రజలు పదవికి దూరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ మహిళా అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో చుక్కెదురైంది.  

మరిన్ని వార్తలు