500 తీసుకోండి.. ఓటు వేయకండి!

19 May, 2019 14:32 IST|Sakshi

లక్నో: తమను ఓటు వేయకుండా బీజేపీ అడ్డుకుందని ఉత్తరప్రదేశ్ చాందౌలీ లోక్‌సభ నియోజకవర్గంలోని తారాజీవన్‌పూర్‌ గ్రామస్తులు ఆరోపించారు. శనివారం రాత్రి బీజేపీ కార్యకర్తలు తమ గ్రామానికి వచ్చి 500 రూపాయల చొప్పున పంపిణీ చేశారని, బలవంతంగా తమ చేతివేళ్లపై ఇంక్‌ చుక్క పెట్టారని తెలిపారు. ఓటు వేయడానికి వెళ్లొద్దని తమను ఒత్తిడి చేశారని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారిని ఓటు వేయకుండా చేయడానికి బీజేపీ రూ. 500 చొప్పున పంపిందని సమాజ్‌వాదీ పార్టీ పేర్కొన్న నేపథ్యంలో తారాజీవన్‌పూర్‌ గ్రామస్తులు ఈ ఆరోపణలు చేశారు. 

ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండేపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై తారాజీవన్‌పూర్‌ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, దర్యాప్తు జరిపిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు అధికారి కుమార్ హర్ష్‌ తెలిపారు. చాలా గ్రామాలకు బీజేపీ కార్యకర్తలను పంపి దళితులు ఓటు వేయకుండా మహేంద్రనాథ్‌ పాండే కుట్రలు చేశారని సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్‌ చౌహాన్‌ ఆరోపించారు. గ్రామస్తుల చేతి వేళ్లపై బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంక్‌ చుక్కలు పెట్టారని తెలిపారు. బీజేపీ దురాగతాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు