బాబొచ్చాడు.. బార్లొచ్చాయి...

11 Nov, 2017 10:28 IST|Sakshi

బొబ్బిలి: బాబు వస్తే జాబొస్తుందని నమ్మించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు వి.ఇందిర విమర్శించారు.  సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  మద్యం అమ్మకాలకు లక్ష్యాలు విధించి మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఆదాయ వనరుగా పరిగణిస్తుందని, మీరయినా దృష్టి సారించి నియంత్రించాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్‌కు లేఖలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 20వేల లేఖలు రాయగా అందులో బొబ్బిలి ప్రాంతం నుంచే పదివేల లేఖలుండటం విశేషమని చెప్పారు.

మద్యం కారణంగా మహిళలపై హింస, అత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. మద్యానికి బానిసలై ఇంటిని పట్టించుకోకపోవడంతో మహిళలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. యువత మద్యానికి బానిసవడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.  బెల్ట్‌ షాపులపై ఎక్సైజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ అమ్ముతున్నారో చూపించాలని ప్రశ్నిస్తున్నారని, అసలు ఎక్కడ అమ్మడం లేదో వారే చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.  మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ఆమె వెంట కె.పుణ్యవతి, సీహెచ్‌ రమణమ్మ, పి.సత్తెమ్మ, ఎస్‌.రాముడమ్మ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు