టికెట్‌ ఇవ్వకున్నా.. ఆయనకే నా సపోర్టు!

28 Apr, 2019 12:25 IST|Sakshi

న్యూఢిల్లీ : తనకు టికెట్‌ ఇవ్వకపోయినప్పటికీ బీజేపీకి తన మద్దతు ఉంటుందని దివంగత ఎంపీ, నటుడు వినోద్‌ ఖన్నా భార్య కవితా ఖన్నా స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లోని గురుదాస్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావించిన సంగతి తెలిసిందే. మొదట ఆమెకు టికెట్‌ కేటాయించేందుకు బీజేపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది. కానీ చివరి నిమిషంలో.. పార్టీలో చేరిన సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ను బరిలో దించడంతో కవిత తీవ్ర నిరాశకు లోనయ్యారు. నామినేషన్‌ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అధిష్టానం ఇలా వ్యవహరించడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన కవితా ఖన్నా.. ‘ ఈ విషయాన్ని వివాదంగా మార్చదలచుకోలేదు. పార్టీ కోసం త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకే నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే నా విషయంలో జరిగిన తప్పు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకున్న తర్వాత టికెట్‌ను వేరే వాళ్లకు కేటాయించారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. తిరస్కారభావంతో కుంగిపోయాను. ఆ సమయంలో తమ పార్టీలో చేరాల్సిందిగా ఎంతోమంది నన్ను సంప్రదించారు. కానీ నేనలా చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా నేను కచ్చితంగా గెలిచి తీరతాను. అయితే నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా, పార్టీ, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి... గురుదాస్‌పూర్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు.

కాగా బాలీవుడ్‌ వినోద్‌ ఖన్నా లోక్‌సభ ఎంపీగా గురుదాస్‌పూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. బీజేపీ టికెట్‌పై నాలుగు పర్యాయాలు(1998.99, 2004, 2014) గెలిచిన ఆయన ఏప్రిల్‌ 2017న మరణించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జకార్‌ గెలుపొందారు. ఇక లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో భాగంగా మే19న పంజాబ్‌లో పోలింగ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు