టీడీపీకి ఓటేయకుంటే వెలేయండి

23 Mar, 2019 05:47 IST|Sakshi

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన

చోడవరం/నర్సీపట్నం: డబ్బులు తీసుకొని అమ్ముడుపోయే వారికి నచ్చజెప్పి టీడీపీకి ఓటు వేయించండి.. వినకపోతే వారిని వెలివేయండంటూ సీఎం చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా గ్రామాల్లో ప్రజల మధ్య రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగించడం చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా చోడవరంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష పార్టీపైన, నరేంద్రమోదీ, కేసీఆర్‌లపై చంద్రబాబు విమర్శలు చేశారు. నీతిమాలిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారని, మోదీ కక్షకట్టి నాపై దాడిచేస్తున్నారని, మనపై దాడిచేస్తే ఊరుకునేది లేదన్నారు.

నాకు రిటర్న్‌ గిఫ్టు ఇస్తానన్న వారిని, నాపై కక్షసాధింపు చర్యలకు దిగిన వారి అంతు చూస్తానని, ఎన్నికల అనంతరం ఢిల్లీలో చక్రం తిప్పుతానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.లక్ష కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని, కేంద్రం కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వాటా ఇవ్వడం లేదన్నారు. చోడవరంను కుప్పం కంటే బాగా అభివృద్ది చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో అనకాపల్లి టీడీపీ ఎంపీ, చోడవరం అసెంబ్లీ అభ్యర్ధి ఆడారి ఆనంద్, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పాల్గొన్నారు.

నన్ను విమర్శించే అర్హత పవన్‌కు లేదు...
తనను విమర్శించే అర్హత పవన్‌ కల్యాణ్‌కు లేదని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం టీడీపీ అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చేసిన కృషిని తక్కువ చేసి మాట్లాడటం జనసేన పార్టీ నాయుకుడు పవన్‌కళ్యాణ్‌కు తగదన్నారు.

కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేసిందని విమర్శించారు. ఉదయం 11.30 గంటలకు సీఎం రావాల్సి ఉండగా మధ్యాహ్నం 3.20 నిమిషాలకు వచ్చారు. ఆలస్యంగా వచ్చిన ఆయన సుమారు 40 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడడంతో జనాలు సభ నుండి జారుకోవటం చూసి ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు