ఎన్నికల చట్టాలు ఇవే..  ఉల్లంఘిస్తే శిక్షే

24 Mar, 2019 09:59 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యం దేశంలోని చట్టాల గురించి అవగాహన అవసరం. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలే కీలకం. ఎన్నికల నియమావళిని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్‌ పని చేస్తోంది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక సెక్షన్లు ఉన్పప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఆ చట్టాలేమిటో.. శిక్షలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం. 

  • ఆర్పీ యాక్ట్‌ 123 : లంచగొండితనం, అనుచిత ఒత్తిడి, మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపదికపై వర్గాల పౌరుల మధ్య ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంపొందిస్తే శిక్షకు అర్హులు.
  • ఆర్పీ యాక్ట్‌ 125 : ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించినట్లయితే మూడేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయవచ్చు.
  • ఆర్పీ యాక్ట్‌ 126 : ఎన్నిక సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులవుతారు. అందుకు రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
  • ఆర్పీ యాక్ట్‌ 127 : ఎన్నికల సమావేశంలో అల్లర్లు చేస్తే యూఎస్‌ 42 సీఆర్‌పీసీ ప్రకారం వారికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 2 వేలు జరిమానా లేదా రెండూ విధింవచ్చు. 
  • ఆర్పీ యాక్ట్‌ 127 అ: ఎవరైనా తన పేరు చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 128 : బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 130 : పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ప్రచారం చేస్తే రూ. 250 జరిమానా విధిస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 131 : పోలింగ్‌ బూత్‌కు సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సామగ్రిని స్వాధీనపరచుకుంటారు. మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 132 : ఓటేసే సమయంలో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 133 : ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూరిస్తే శిక్షార్హులు. మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.   
  • ఆర్పీ యాక్ట్‌ 134 : ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. రూ. 500 వరకు జరిమానా ఉంటుంది. 
  • ఆర్పీ యాక్ట్‌ 134 అ : ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల పోలింగ్‌ ఓట్ల లెక్కింపు ఏజెంట్‌గా వ్యవహరిస్తే శిక్షార్హులు. మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 135 : బ్యాలెట్‌ పత్రం, ఈవీఎం అపహరిస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 500జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 135 అ: ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పోలింగ్‌ బూత్‌ స్వాధీనం పరచుకుంటే ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధిస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 135 ఆ : ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవు మంజూరు చేస్తే రూ.5 వేలు వరకు జరిమానా విధిస్తారు. 
  • ఆర్పీ యాక్ట్‌ 135 ఇ : పోలింగ్‌ ఓట్ల లెక్కింపు రోజు మద్యం అమ్మకం, పంపిణీ నేరం. ఆరు నెలలు జైలు రూ. 2 వేలు జరిమానా విధిస్తారు. 
మరిన్ని వార్తలు