కర్ణాటక ఎన్నికల కోసమే ఆ దాడి?

4 May, 2018 17:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ గత రెండు రోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోతోంది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి యూనివర్శిటీ విద్యార్థుల సంఘం శాశ్వత సభ్యత్వం బహూకరించేందుకు బుధవారం సన్నాహాలు జరుగుతుండగా హఠాత్తుగా హిందూ యువ వాహిణికి చెందిన కార్యకర్తలు కర్రలు, పిస్టళ్లు పట్టుకొని యూనివర్శిటీలోకి వచ్చి నానా బీభత్సం సష్టించారు. వారు ఆ సమయంలో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ బస చేసిన యూనివర్శిటీ భవనంలోని గేటును ధ్వంసం చేశారు. లోపలకి జొరబడేందుకు ప్రయత్నించారు. వారిలో హిందూ యువ వాహిణికి చెందిన ఆరుగురు కార్యకర్తలు యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పట్టుకొని అక్కడ ఉన్న పోలీసులకు అప్పగించారు. 

యూనివర్శిటీపై దాడి చేసిన ఆరుగురు గూండాలను యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగిస్తే మరుసటి రోజుకల్లా వారిని పోలీసులు ఎలాంటి కేసును కూడా నమోదు చేయకుండా విడిచిపెట్టారని యూనివర్శిటీ అధికార ప్రతినిధి ఎం. షఫే కిద్వాయ్‌ గురువారం నాడు మీడియాకు తెలియజేశారు. పిస్టళ్లలాంటి మారణాయుధాలను కూడా వారు పట్టుకొచ్చారని చెప్పారు. అన్సారీ కార్యక్రమానికి బందోబస్తుగా యూనివర్శిటీలోకి పోలీసులు వచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 2002లో ఏర్పాటు చేసిన హిందు యువ వాహిణికి చెందిన వారు నిందితులు కనుక పోలీసులు వారిని వదిలేశారని, కేసు పెట్టే ధైర్యం పోలీసులు చేయలేకపోయారని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై ఫిర్యాదు చేయడానికి యూనివర్శిటీ విద్యార్థులు ఊరేగింపుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లగా వారిపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జి చేసి పంపించారని కిద్వాయ్‌ ఆరోపించారు.
 

ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీలో ఆరెస్సెస్‌ శాఖను ఏర్పాటు చేయాలని కొంతకాలంగా ఆరెస్సెస్‌ డిమాండ్‌ చేస్తుండగా, యూనివర్శిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉన్న మొహమ్మద్‌ అలీ జిన్నా ఫొటోను ఎత్తివేయాలని స్థానిక బీజేపీ ఎంపీ పిలుపుతో సంఘ్‌ పరివార్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆ ఫొటోను తొలగించడం కోసమే బుధవారం నాడు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి జొరబడినట్లు హిందూ యువ వాహిణి కార్యకర్తలు తెలిపారు. విద్యార్థి సంఘం కార్యాలయంలో జిన్నా ఫొటోతోపాటు జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ల ఫొటోలు ఉన్నాయి. వారంతా బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులే. 

అవిభక్త భారత చరిత్రలో జిన్నాకు కూడా ఎంతో పాత్ర ఉంది. ఆ పాత్రను ఎవరూ కాదనలేరు. గతంలో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్శిటీలపై దాడి చేసిన మతతత్వ హిందూ శక్తులు ఇప్పుడు అలీగఢ్‌ యూనివర్శిటీపై దాడి చేశాయి. 
ఏఎంయూలోని మొహమ్మద్‌ అలీ జిన్నా ఫొటోపై  80 ఏళ్లుగా ఎలాంటి గొడవ చేయని సంఘ్‌ పరివారం ఇప్పుడే ఎందుకు గొడవ చేయాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్నే. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సులభంగానే సమాధానం దొరకుతుంది. 

>
మరిన్ని వార్తలు