పరిపాలనా రాజధానిగా విశాఖ సరైన నిర్ణయం

18 Dec, 2019 04:06 IST|Sakshi

మాజీ మంత్రి గంటా ట్వీట్‌

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ శాసనసభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనను స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అధికార ట్విట్టర్‌ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు. అధికారిక వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం నిర్ణయం మంచిదన్నారు. సముద్ర తీర ప్రాంతమైన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు, రైలు, విమానయానం, జల రవాణాతో అనుసంధానమైన విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా మారితే.. విశ్వనగరంగా, రాష్ట్ర ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే సిటీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

ప్రణాళిక అడిగితే జారుకుంది
సింగపూర్‌ కంపెనీ తీరుపై అసెంబ్లీలో మంత్రి బొత్స  
సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వెనుక భారీ అవినీతి దాగుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని నిర్మాణ ప్రణాళిక లక్ష్యాలను ఎలా సాధిస్తారని తమ ప్రభుత్వం అడిగితే సింగపూర్‌ కంపెనీ సమ్మతించలేదని ఆయన తెలిపారు. రాజధాని అంశంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ లక్ష్యాలను ఎలా సాధిస్తారో వివరిస్తే తాము ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఆ కంపెనీతో చెప్పినప్పటికీ వారు మాత్రం తమ ప్రణాళికను వెల్లడించలేదన్నారు. పైగా.. ఆ కంపెనీయే స్వయంగా పరస్పర అంగీకారంతో విడిపోదామని చెప్పిందన్నారు. ఇంతవరకు అయిన ఖర్చును దామాషా ప్రకారం భరించడానికి ఒక అంగీకారానికి వచ్చామని చెప్పారు.

ఉత్తరాంధ్ర వివక్షకు గురైంది
స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన
సాక్షి, అమరావతి : అభివృద్ధిలో శ్రీకాకుళం జిల్లా వివక్షకు గురైందన్న ఆవేదన తనకూ ఉందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న 23 సంస్థల్లో ఒక్కటి కూడా శ్రీకాకుళం జిల్లాకు కేటాయించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని అంశంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా స్పీకర్‌ జోక్యం చేసుకుంటూ.. తాను శాసన సభాపతిగా కాకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేగా తన అభిప్రాయం చెబుతున్నానన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణ చేయకపోతే ప్రజల్లో అసంతృప్తిని అరికట్టలేమన్నారు. అభివృద్ధికి కీలకమైన పోర్టు, ఎయిర్, రోడ్‌ కనెక్టివిటీ ఉన్న విశాఖపట్నం కంటే మెరుగైన కనెక్టివిటీ ఉన్న నగరం రాష్ట్రంలో ఏముందని  ప్రశ్నించారు.

అమరావతిలో దళితులకు అన్యాయం
ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో కూడా చంద్రబాబు అంటరానితనాన్ని పాటించారని వైఎస్సార్‌సీపీ సభ్యుడు సుధాకర్‌బాబు మండిపడ్డారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో మంగళవారం జరిగిన  చర్చలో ఆయన మాట్లాడుతూ.. అమరావతికి భూములు ఇచ్చిన వారిలో అగ్రకులాల వారికి స్థలాలు ఒక చోట కేటాయించి దళితులకు వేరేచోట కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  అమరావతిలో టీడీపీ దళితులకు ద్రోహం చేసిందని.. దళితులకు స్థానంలేని రాజధాని నిర్మించాలని చంద్రబాబు భావించారని దుయ్యబట్టారు.

విశాఖను చంద్రబాబు విస్మరించారు
ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌
సాక్షి, అమరావతి : హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందగల విశాఖపట్నంను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చేయాలన్న తమ వాదనను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. దక్షిణాఫ్రికా మాదిరిగా వికేంద్రీకరిస్తూ బహుళ రాజధానుల విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.


 

మరిన్ని వార్తలు