ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?

20 Jan, 2020 13:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని పెడతామంటే.. ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు.. విశాఖపట్నం ఏమైనా అరణ్యమా?’ అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సూటిగా ప్రశ్నించారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తీరుపై, ఎల్లో మీడియా ప్రచారంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మావోయిస్టులు ఉన్నారని ఎల్లో మీడియాతో టీడీపీ నేతలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌ నుంచి గత ప్రభుత్వం అమరావతికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అమరావతిలో జరిగింది రాజధాని నిర్మాణామా? లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించిందని, 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఒకవిధంగా, ప్రైవేటు సంస్థలకు మరోవిధంగా భూకేటాయింపులు జరిపి.. అనేక అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అమరావతిలోని భూములను టీడీపీ స్వాహా చేసిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. అన్ని ప్రాంతాల మీద భారాన్ని మోపి.. అమరావతిలో తాను, తనకు చెందిన 20, 30 మంది మాత్రమే అభివృద్ధి చెందాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే అమరావతిలోని భూములన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని,అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని, వానల కోసం అక్కడి ప్రజలు కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారని తెలిపారు. అనంతపురంలోని దుర్భర కరువు పరిస్థితులను చూసి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కంటతడి పెట్టారని, ఇక్కడి ప్రజలకు కనీసం గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని సూచించారని గుర్తు చేశారు. ఇక, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఎక్కువగా వలసలు చోటుచేసుకుంటున్నాయని, అక్కడ బతుకుదెరువు లేక, చేసుకోవడానికి పనిలేక అక్కడి ప్రజలు వలస వెళుతున్నారని, శ్రీకాకుళం మత్య్సకారులు పాకిస్థాన్‌లో పట్టుబడితే.. సీఎం జగన్‌ కల్పించుకొని వారిని విడిపించి.. ఇక్కడికి తీసుకొచ్చారని, వారికి ఐదు లక్షల చొప్పున సీఎం ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తమ ప్రభుత్వం రాజధాని పేరిట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయబోదని బుగ్గన స్పష్టం చేశారు. వందేళ్ల తప్పులను సరిదిద్దాలనుకుంటున్నామని, ఐదేళ్లది కాదని తెలిపారు. ప్రజానామస్మరణ చేసుకుంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళుతున్నారని చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా