విశాఖ క్షేమమా.. వలసవాదమా..

23 Mar, 2019 14:04 IST|Sakshi

విశాఖ ఒడిలోనే ఒదిగి..

ఎంవీవీ సత్యనారాయణ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

ఏమాత్రం సంబంధం లేకుండా.. వీవీ లక్ష్మీనారాయణ, జనసేన

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఎంవీవీ సత్యనారాయణ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని ముద్దాపురం గ్రామంలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగారు,
డిగ్రీ పట్టాపుచ్చుకుని 30 ఏళ్ళ కితం విశాఖపట్నం వచ్చిన ఆయన ఎంవీవీ బిల్డర్స్‌ స్థాపించారు.
నగరంలో ఇప్పటివరకు 80 అపార్ట్‌మెంట్లు.. మొత్తంగా పదివేల యూనిట్ల(ఫ్లాట్ల)తో అపార్ట్‌మెంట్లు నిర్మించారు.
విశాఖలో నెంబర్‌ వన్‌ రియల్‌ వ్యాపారిగా ఎదిగి బిల్డర్స్‌కు రోల్‌మోడల్‌గా మారారు,. విశాఖ బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా రెండు దఫాలు వ్యవహరించారు.
ఆ హోదాలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నో సంస్థలకు ఆర్ధిక సాయం అందించారు.
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగిన సత్యనారాయణను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక వేధింపులకు గురిచేసి కేసులు నమోదు చేసింది.
పీఎంపాలెంలోని అంతర్జాతీయ వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియం ఎదురుగా అతిపెద్ద అపార్ట్‌మెంట్‌(1600 ఫ్లాట్లు) నిర్మాణం తలపెట్టారు. దీనికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌లో 80 ఫీట్‌ రోడ్డు ఉంది. వాస్తవానికి  రోడ్డు చూపించే జీవీఎంసీ ప్లాన్‌ అప్రూవ్‌ చేసింది. ఇందుకు ప్లాన్‌ అప్రూవల్‌ ఫీజు కింద రూ.14కోట్లు కూడా చెల్లించారు. అయితే రోడ్డు పక్కనే టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావుకు ఉన్న స్థలంలో  400 గజాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీంతో మంత్రి.. ప్లాన్‌ను రద్దు చేసుకోవాలని ఎంవీవీపై  ఒత్తిడి తెచ్చాడు. రూ.14కోట్లు చెల్లించి తీసుకున్న ప్లాన్‌ను క్యాన్సిల్‌ చేసుకోలేనని, కావాలంటే నష్టపోతున్న 400 గజాలను వేరే చోట ఇస్తానని ఆయన కళాకు స్పష్టం చేశారు. కానీ 2వేల గజాలు కావాలని మంత్రి కళా పట్టుబట్టారు. దీనికి ఎంవీవీ అంగీకరించపోవడంతో అహం దెబ్బతిన్న మంత్రి కళా.. ప్రభుత్వ స్థలం కబ్జా చేశారంటూ తన మేనల్లుడితో తప్పుడు ఫిర్యాదు చేయించి.. అప్పటి సీపీ యోగానంద్‌పై ఒత్తిడి తెచ్చి.. కేసు నమోదు చేయించారు. అయితే వెంటనే హైకోర్టు స్టే  ఇచ్చింది. దరిమిలా టీడీపీ అక్రమాలపై పోరాటం చేయాలని ఎంవీవీ నిర్ణయించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ లోక్‌సభ సమన్వయకర్తగా గత ఆరునెలలుగా ప్రజాసమస్యలపై నిరంతర ఉద్యమాలు చేపట్టారు.
ఎంపీగా విశాఖలోనే నివసించే అభ్యర్థి గెలిస్తే ప్రజలకు విస్తృత సేవలందించవచ్చని ఎంవీవీ భావిస్తున్నారు.

ఏమాత్రం సంబంధం లేకుండా.. వీవీ లక్ష్మీనారాయణ, జనసేన
వీవీ లక్ష్మీనారాయణ.. జేడీ లక్ష్మీనారాయణగా పేరొందిన ఈయన స్వస్థలం వైఎస్సార్‌ జిల్లా కడప. కర్నూలు జిల్లా శ్రీశైలంలో విద్యాభ్యాసం చేసి ఐపీఎస్‌గా వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన ఈయనకు విశాఖతో ఎటువంటి అనుబంధం లేదు.
సీబీఐ జేడీగా ఈయన వివాదాస్పద వ్యవహార శైలి అందరికీ తెలిసిందే..
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసు వివరాలపై పచ్చ పత్రికలకు లీకులిచ్చి... లేనిపోని తప్పుడు కథనాలను వండివార్చేందుకు సహకరించడం ద్వారా ఉద్యోగ ధర్మానికే ద్రోహం చేసిన పెద్దమనిషి..
ఇదే పెద్ద మనిషి చంద్రబాబునాయుడుపై కేసుల విషయానికి వచ్చేసరికి సీబీఐలో తగిన సిబ్బంది లేరని.. విచారణ జరపలేమని కోర్టుకు నివేదించేశారు.
లక్ష్మీనారాయణ పనితనం మొదట్లో పెద్దగా ఎవరికీ తెలియక పోయినా.. తర్వాతికాలంలో ఆయన గారి అసలు రూపంపై చాలామందికి అవగాహన వచ్చింది.
సరే.. ప్రస్తుత విషయానికొస్తే.. ఈయనగారు జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగారు.
కొన్నాళ్ళ కిందట.. సరిగ్గా చెప్పాలంటే 2018 జూన్‌ 28న పవన్‌కల్యాణ్‌ విశాఖలో మాట్లాడుతూ వలసవాదులు విశాఖ ప్రాంతాన్ని దోచేస్తున్నారని, ఇలానే కొనసాగితే తెలంగాణ ఉద్యమ పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమవుతాయని వ్యాఖ్యానించారు.
మరి అదే పవన్‌కల్యాణ్‌ .. స్థానికుడు కాని, విశాఖతో ఏమాత్రం సంబంధం లేని లక్ష్మీనారాయణను ఇక్కడికి దిగుమతి చేయడం వెనుక ఆంతర్యమేమిటి..
ఎవరి ఓట్లు చీల్చేందుకు.. ఎవరికి మేలు చేసేందుకు?
పోనీ.. ఓడిపోయినా తాను విశాఖలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని జేడీ లక్ష్మీనారాయణ వాగ్దానం చేయగలరా..

పదేళ్ల తర్వాత మళ్లీ విశాఖ బరిలోకి..
దగ్గుబాటి పురందేశ్వరి, భారతీయ జనతా పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ తనయగా.. అందరికీ తెలిసిన దగ్గుబాటి పురందేశ్వరి 2009లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవి కూడా అందుకున్నారు.
మరి ఆ అవకాశం కల్పించిన విశాఖకు ఆమె ఏం చేశారు?..
మంత్రిగా ఉన్న ఐదేళ్ళ కాలంలో విశాఖకు ఈ ఒక్కపనైనా చేశాను అని స్పష్టంగా చెప్పగలరా..?
మంత్రిగా ఉన్నప్పుడే చుట్టపుచూపుగా అరుదెంచిన ఆమె ఆ తర్వాత ఎప్పుడైనా విశాఖకు మొహం చూపించారా.
కనీసం ఆ పార్టీ క్యాడర్‌నైనా పలకరించారా..
అప్పుడు కాంగ్రెస్‌లో ఉండి.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా వచ్చి ఏమని చెప్పి ఓట్లడుగుతారు..?
విశాఖ ప్రజలను ఓట్లగేందుకు ఆమె నిబద్ధత ఏమిటి?
ఓడిపోయినా విశాఖలోనే ఉంటానని ఆమె హామీనివ్వగలరా...

వారసుడిగారంగంలోకి..
ఎం.శ్రీ భరత్, తెలుగుదేశం

సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడిగా, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడిగా ఇప్పడిప్పుడే అందరికీ తెలుస్తున్న గీతం వర్సిటీ చైర్మన్‌ ఎం. శ్రీభరత్‌ విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకున్న కనీస రాజకీయ పరిజ్ఞానం ఎంత...?
తూర్పుగోదావరి జిల్లా అయినవోలులో పుట్టి విదేశాల్లో పెరిగి అక్కడే డిగ్రీలు చదువుకున్న భరత్‌కు విశాఖ నగరంపై, జిల్లాపై ఏం అవగాహన ఉందని పోటీ చేస్తున్నారు..?
తాత ఆకస్మిక మృతితో ఆస్తులు, అంతస్తులు, వ్యాపార సామ్రాజ్యం వారసత్వంగా వచ్చిన మాట నిజమే.. కానీ రాజకీయ వారసత్వం అప్పనంగా ఎలా వస్తుంది.?
విదేశాల్లో చదువుకుని.. ఆనక హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుని.. తాత చనిపోయే వరకు విశాఖ మొహం తెలియని భరత్‌ ఏ అర్హతతో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు..?
విశాఖ పట్ల ఆయన నిబద్ధత ఏ పాటిది?
ఓడినా రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పగలరా..

మరిన్ని వార్తలు