శత్రువుకు సాయం చేసే వ్యక్తి వైఎస్సార్‌

3 Apr, 2019 10:02 IST|Sakshi
రామిరెడ్డిపల్లి గ్రామస్తులతో సమావేశం నిర్వహించిన మంచు విష్ణు

శ్రీవిద్యానికేతన్‌పై కుట్రతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదు

విద్యాసంస్థల ద్వారా రెండువేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం

శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సీఈఓ, నటుడు మంచు విష్ణు

సాక్షి, చంద్రగిరి: శత్రువుకు సైతం సాయంచేసే మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి అని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సీఈఓ, నటుడు మంచు విష్ణు కొనియాడారు. మంగళవారం రాత్రి ఆయన మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీలో రచ్చబండ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. 27 ఏళ్లుగా పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నామన్నారు. ఏనాడు తాము రాజకీయాలపై ఆసక్తి చూపలేదని తెలిపారు. అలాంటి తమ సంస్థపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రావా ల్సిన రూ.19కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించకుండా, ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పనిచేసినా నియోజకవర్గానికి, ప్రాంతానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

శ్రీవిద్యానికేతన్‌ను నెలకొల్పి చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల మందికి మోహన్‌బాబు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎంతమందికి ఉపాధి కల్పిం చారో ఆలోచించాలని సూచించారు. వైఎస్‌ హయాంలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే ఆయన తనయుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లాంటి పథకాలను తీసుకొచ్చారన్నారు. వాటిని అమలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మాజీ సర్పంచ్‌ కొటాల పద్మజ, ఎంపీటీసీ సభ్యురాలు పుష్పలత, రాజేంద్రప్రసాద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, సంస్థల ఏఓ సుదర్శన్‌నాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు