జగన్‌ హోదా ఎత్తుకున్నాకే టీడీపీ యూటర్న్‌: విష్ణుకుమార్‌

2 Feb, 2019 05:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాటం చేయడం మొదలుపెట్టాకే టీడీపీ యూటర్న్‌ తీసుకుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీ–టీడీపీల బంధం బాగానే ఉండేదని, కానీ జగన్‌ హోదా కోసం ఎప్పుడైతే ముందడుగు వేశారో.. ఆయన కంటే ఎక్కడ వెనుకబడిపోతామో అని కంగారుపడి టీడీపీ యూటర్న్‌ తీసుకుని తమతో విభేదించిందని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుందని, బీజేపీ అన్యాయం చేసిందనేది సాకు మాత్రమేనని విమర్శించారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు’ అంశంపై ఆయన మాట్లాడారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం సభ్యులు పదేపదే అడ్డు తగులుతూ సంబంధం లేని వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ టీడీపీ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రకరకాల డ్రామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించి ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తోనే జతకట్టిందంటే పసుపు రంగు అపవిత్రమైందని విమర్శించారు. 

మేడా ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి..
విష్ణుకుమార్‌రాజు ప్రసంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుకుంటూ.. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాకే మాట్లాడాలని, లేదంటే మాట్లాడనిచ్చేది లేదన్నారు. దీంతో ముందు మేడా మల్లికార్జునరెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలంటూ విష్ణుకుమార్‌రాజు దీటుగా బదులిచ్చారు. దీనికంటే ముందు ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఎందుకు చేయించలేదో టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. 

జగన్‌ తరఫున మాట్లాడుతున్నారా?
ఈ సమయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు లేచి.. విభజన అంశాల్ని మాట్లాడకుండా జగన్‌ తరఫున మాట్లాడుతున్నారని, జగన్‌ పార్టీలోకి ఏమైనా వెళుతున్నారా? అని ప్రశ్నించారు. విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ.. మరో రెండునెలలాగితే ఎవరు ఏపార్టీలోకి వెళతారో, ఇక్కడున్న సభ్యుల్లో ఎంతమంది బయటకు వెళతారో తెలుస్తుందని బదులిచ్చారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. విభజన గురించే విష్ణుకుమార్‌రాజు మాట్లాడాలని, మిగతా అంశాలు లేవనెత్తితే మాట్లాడనివ్వమన్నారు. తన ప్రసంగానికి పదేపదే టీడీపీ సభ్యులు అడ్డుతగలడం, ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండడాన్ని విష్ణుకుమార్‌రాజు తప్పుపట్టారు. మీరు వ్యవహరించే తీరు వల్లే ప్రతిపక్ష సభ్యులు సభకు రావట్లేదని, బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 

జాతీయ రహదారులపై అయ్యన్నపాత్రుడే ప్రశంసించారు
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 4,193 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని ఇప్పుడవి 7,246 కిలోమీటర్లకు చేరాయంటే బీజేపీ ఘనతేనని, దీనిపై స్వయానా మీ మంత్రి అయ్యన్నపాత్రుడే ప్రశంసించారని విష్ణుకుమార్‌రాజు అన్నారు.  మీకు ఎంతసేపూ ఓట్ల గురించేనా? ఇక్కడ ఖర్చుచేసిన నిధులు కనిపించట్లేదా? అని నిలదీశారు. అభివృద్ధి తెలుగుదేశం సభ్యులకు తెలియదు, మనమైనా చెప్పాలి అధ్యక్షా.. అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం మంచిపని చేస్తే వీళ్లు వక్రీకరిస్తారు, బురద జల్లుతారు, ఏమైనా మాట్లాడితే అపోజిషన్‌ పార్టీకి అంటకాగుతున్నావా అంటారు.. అంటూ టీడీపీపై మండిపడ్డారు. 

టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని అనుసరించింది...
టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని అనుసరించిందని, వాస్తవాలను మభ్యపెడుతూ వస్తోందని విష్ణుకుమార్‌రాజు దుయ్యబట్టారు. విభజన జరిగినప్పుడు టీడీపీ ఇక్కడ లేదా? లేఖలిచ్చింది వాస్తవం కాదా? సమన్యాయం చేయమని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీలు పొత్తుకు వెళ్లడంపై ప్రజలంతా ముక్కుమీద వేలేసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘‘హోదా సాధ్యం కాదు, ప్యాకేజీ ఇస్తామంటే ఇదే సభలో నరేంద్ర మోదీపై సీఎం నుంచి సభ్యుల వరకూ ప్రశంసలు కురిపించలేదా? 2015లో మోదీకి ధన్యవాదాలు చెబుతూ లేఖ రాయలేదా? మరి ఇప్పుడెందుకు విభేదించారు... అది కేవలం జగన్‌ హోదాపై పోరాటం చెయ్యడంతోనే. ఆ తర్వాతే మమ్మల్ని పక్కనపెట్టి డైవర్షన్‌ తీసుకున్నారు’’ అని తప్పుపట్టారు. ‘‘బీజేపీకి టీడీపీ మిత్రద్రోహం చేసింది. టీడీపీ, పవన్‌కల్యాణ్, బీజేపీలు కలసి పోటీ చేసినందువల్లే మీరు ఆ స్థానంలో కూర్చున్నారు. మొన్నటి వరకు పవన్, జగన్, మోదీ విలన్‌లు.. ఇప్పుడేమో పవన్‌కు మెల్లగా ప్రేమబాణాలు వేస్తున్నారు. ఆ స్థానంలో కేసీఆర్‌ను కూర్చోబెట్టారు. ఎన్నికలకు ముందు రకరకాల డ్రామాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారా లేదా అనే విషయాన్ని చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు