ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..

29 Dec, 2019 14:34 IST|Sakshi

హైపవర్‌ కమిటీని స్వాగతిస్తున్నా: విష్ణుకుమార్‌రాజు 

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన హైపవర్‌ కమిటీ నియమాకాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. లక్ష కోట్లు ఒక ప్రాంతంలో వెచ్చించి అభివృద్ధి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు.

తాత్కాలిక కట్టడాల పేరుతో చంద్రబాబు చదరపు గజానికి రూ. 12వేలు వెచ్చించారని, అదే విశౠఖలో అయితే రూ. 4వేలతో పూర్తయ్యేదని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్లే ఇప్పుడు అమరావతి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా చేసిన రూ. వందల కోట్లతో విశాఖలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గతంలోనే విశాఖను రెండో రాజధానిగా చేయాలని శివరామకృష్ణన్‌ కమిటీ కూడా సూచించిందని చెప్పారు.

మరిన్ని వార్తలు